రూ. 62,370 కోట్లతో 97 తేజస్‌ యుద్ధ విమానాల కొనుగోలు

రూ. 62,370 కోట్లతో 97 తేజస్‌ యుద్ధ విమానాల కొనుగోలు

వైమానిక దళం కోసం 97 తేజస్‌ తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలుకు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ (హెచ్ఏఎల్)తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 97 యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఎస్) ఆమోదించిన నెల రోజుల తర్వాత హెచ్ఏఎల్ తో రక్షణశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఇందులో 68 సింగిల్ సీట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కాగా మరో 28 ట్విన్ సీట్ విమానాలు ఉన్నాయి.

2021లో 48 వేల కోట్ల రూపాయల విలువైన 83 తేజస్ ఎంకె1ఎ యుద్ధ విమానాల కొనుగోలుకు  హెచ్ఏఎల్ తో రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. తాజాగా చేసుకున్న ఒప్పందం రెండోది. 97 తేజస్-ఎంకె1ఎలను రూ. 62,370 కోట్లతో రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది. ఈ యుద్ధ విమానాల్లో ఆధునిక ఫీచర్లైన స్వయం రక్షా కవచ్‌, నియంత్రణ వ్యవస్థలు సహా 64శాతం దేశీయంగా తయారైనవే ఉంటాయని రక్షణ శాఖ తెలిపింది. 

భారత్‌లో తయారైన 67వస్తువులను తేజస్‌లో ఉపయోగిస్తున్నట్లు వివరించింది. 2027-28 నుంచి నూతన యుద్ధ విమానాలను క్రమంగా వైమానిక దళానికి  హెచ్ఏఎల్ అందించనుంది. వాయుసేన వీడ్కోలు పలికిన మిగ్‌-21 యుద్ధ విమానాల స్థానాన్ని ఇవి భర్తీ చేయనున్నాయి. వైమానిక దళానికి 42 స్క్వాడ్రన్లను అధికారికంగా కేటాయించగా యుద్ధ విమానాల కొరతతో 31 స్వ్కాడ్రన్లు మాత్రమే పనిచేస్తున్నాయి. 

అతి ప్రమాదకర గగనతల వాతావరణంలోనూ పోరాడే సామర్థ్యం తేజస్‌ పోరాట విమానాలకు ఉంది. అయితే, భారత్‌ దేశీయంగా అభివృద్ధి చేసిన ఫైటర్‌ జెట్‌ తేజస్‌ మార్క్‌-2కు అమెరికా తయారీ జీఈ ఎఫ్‌-414 (జిఇ ఎఫ్-414 ) ఇంజిన్లను అమర్చకపోవచ్చన్న ప్రచారం నడుస్తోంది. అగ్రరాజ్యం నుంచి సరఫరాలు మందగించిన నేపథ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్‌ ఎస్‌ఏతో కలిసి భారత్‌లో ఇంజిన్‌ను అభివృద్ధి చేయడంపై చర్చలు జోరందుకొన్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ కథనం వెల్లడించింది. 

అయితే భారత్‌ ఆ కంపెనీ నుంచి ఇంజిన్లను నేరుగా కొనుగోలు చేస్తుందా? లేదా సంయుక్తంగా అభివృద్ధి చేస్తుందా? అనే దానిపై స్పష్టత రాలేదని భారత్‌కు చెందిన అధికారులు వెల్లడించినట్లు సదరు పత్రిక పేర్కొంది. మరోవైపు మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌లకు తుది వీడ్కోలు పలికేందుకు వాయుసేన ఏర్పాట్లు చేస్తోంది. 6 దశాబ్దాల పాటు భారత వాయుసేనకు వెన్నెముకగా నిలిచిన మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌ల సేవలు శుక్రవారంతో నిలిచిపోయిన్నాయి. 

“పాంథర్స్” అనే పేరుతో పిలిచే 23వ నంబర్ స్క్వాడ్రన్‌కు చెందిన మిగ్-21 జెట్‌లలో చివరిదానికి చండీగఢ్ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో వీడ్కోలు పలకనున్నారు. శుక్రవారం ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ‘బాదల్ 3’ అనే కాల్ సైన్‌తో స్క్వాడ్రన్ చివరి యాత్రను చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి పాల్గొననున్నారు. 

మిగ్-21 యుద్ధ విమానాలు రష్యాకు చెందినవి. ఆరు దశాబ్దాల క్రితం భారత వాయుసేనలోకి చేరి కీలక సేవలు అందించాయి. అయితే హైస్పీడ్‌ ల్యాండింగ్‌ వల్ల మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌లు నడపడం పైలట్లకు సవాలుతో కూడుకున్నవనే భావనలున్నాయి. షార్ట్‌ రన్‌వేలపై దిగడం కష్టతరం కావడంతో పలుమార్లు ప్రమాదానికి గురయ్యాయి.

ఈ ప్రాజెక్టుకు దాదాపు 105 భారతీయ కంపెనీల బలమైన విక్రేత స్థావరం మద్దతు ఇస్తుంది. ఇవి నేరుగా వివరణాత్మక భాగాల తయారీలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ఉత్పత్తి ఆరు సంవత్సరాల పాటు సంవత్సరానికి దాదాపు 11,750 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఇది దేశీయ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

హెచ్ఏఎల్ ద్వారా తయారు చేయనున్న ఈ అధునాతన స్వదేశీ విమానం, భారత వైమానిక దళం కార్యాచరణ సామర్థ్యాలను బలోపేతం చేయడమే కాకుండా, రక్షణ తయారీ రంగంలో దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా స్వావలంబన చేయడంలో మరో ముఖ్యమైన మైలురాయిని కూడా సూచిస్తుంది.  తేజస్  మిగ్‌-1ఏ విమానాల ప్రవేశంతో, వైమానిక దళం వేగవంతమైన, ఆధునిక, నమ్మదగిన యుద్ధ జెట్‌లను అందుకుంటుంది. ఇది ప్రస్తుత స్క్వాడ్రన్ బలాన్ని పెంచుతుంది. మిగ్-21 వంటి పాత విమానాలను దశలవారీగా విరమణ చేయడం ద్వారా సృష్టించబడిన అంతరాన్ని పూరిస్తుంది.