లడఖ్‌లో జరిగిన హింసాకాండలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడిన నేపథ్యంలో, లడఖ్ కు చెందిన విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌కు చెందిన ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీఓ) స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లడఖ్ ఐ(ఎస్ఈసిఎంఓఎల్) ఎఫ్‌సిఆర్‌ఎ లైసెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం తక్షణమే రద్దు చేసింది.
ఈ సంస్థ లాభాపేక్షలేని సంస్థ విదేశీ నిధుల నిబంధనలను ‘పదేపదే’ ఉల్లంఘించిందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) తన ఉత్తర్వులో పేర్కొంది. వాంగ్‌చుక్ వ్యక్తిగత, ఉమ్మడి ఖాతాలలో నిధులు అందాయని, ఇది ఎంహెచ్ఏ 2010 ప్రత్యక్ష ఉల్లంఘన అని ఎంహెచ్ఏ పేర్కొంది. 2021 నుండి 2024 మధ్య అతని ఎన్జీఓ విదేశాల నుండి కోట్లాది రూపాయలు అందుకున్నట్లు, ఈ “బాహ్య విదేశీ చెల్లింపులు తెలియని సంస్థలకు జరిగింది” కాబట్టి, మనీలాండరింగ్ సాధ్యమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
“సోనమ్ వాంగ్‌చుక్ తనను తాను ప్రజల లక్ష్యానికి ప్రతినిధిగా చూపించుకుంటూనే ఉన్నప్పటికీ, ఆర్థిక దుష్ప్రవర్తన రికార్డు మరోలా ఉందని సూచిస్తుంది” అని ఎంహెచ్ఏ తన ఉత్తర్వులో పేర్కొంది. “అతని చర్యలు నిర్మాణాత్మక సంప్రదింపులను పక్కదారి పట్టించే ప్రమాదం ఉంది. నిజమైన ఆందోళనలను వ్యక్తిగత, రాజకీయ లాభం కోసం సాధనాలుగా మార్చే ప్రమాదం ఉంది” అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
59 ఏళ్ల ఈ వ్యక్తికి తొమ్మిది వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, కానీ వాటిలో ఎనిమిదింటిని ప్రకటించలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వులో పేర్కొంది. ఈ ఎనిమిది ఖాతాలలో చాలా వరకు భారీ విదేశీ చెల్లింపులు ఉన్నాయని, వాంగ్‌చుక్ 2021 నుండి 2024 మధ్య తన వ్యక్తిగత ఖాతా నుండి విదేశాలకు దాదాపు రూ. 2.3 కోట్లు పంపాడని మంత్రిత్వ శాఖ తెలిపింది.
వాంగ్‌చుక్ 2018 నుండి 2024 మధ్య వివిధ ఖాతాలలో రూ. 1.68 కోట్ల విదేశీ నిధులను కూడా అందుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. “అతను కార్పొరేట్ రంగాన్ని విమర్శిస్తూనే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సహా వివిధ కార్పొరేట్ సంస్థల నుండి సిఎస్ఆర్ కింద భారీ నిధులను తీసుకుంటారు” అని అది పేర్కొంది. కాగా, అంతకు ముందు సోనమ్ వాంగ్ చుక్ సంస్థపై సిబిఐ దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ)ని ఉల్లంఘించిందంటూ వాంగ్‌చుక్ స్థాపించిన సంస్థ హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడఖ్ (హెచ్‌ఐఎఎల్)పై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి 6న వాంగ్‌చుక్ పాకిస్తాన్ పర్యటనను కూడా సమీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొంతకాలంగా విచారణ జరుగుతోందని, ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని చెప్పారు. హోంమంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ఆదేశాలమేరకు సోదాలు చేపడుతున్నట్లు సుమారు 10 రోజుల క్రితం సిబిఐ బృందం ఒక ఆర్డర్‌తో వచ్చిందని వాంగ్‌చుక్ మీడియాకి వివరించారు.
విదేశీ నిధులను స్వీకరించే ముందు ఎఫ్‌సిఆర్‌ఎ క్లియరెన్స్ తీసుకోలేదని నోటీసు పేర్కొంది. 2022 నుండి 2024 మధ్య వారు అందుకున్న విదేశీ నిధుల వివరాలను కోరుతూ సిబిఐ బృందం గత వారం హెచ్‌ఐఎఎల్, స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్ (ఎస్‌ఇసిఎంఒఎల్)లో సోదాలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ బృందాలు ఇప్పటికీ తమ సంస్థల ఖాతాలను, స్టేట్‌మెంట్స్‌ను పరిశీలిస్తున్నాయని తెలిపారు.
మొదట స్థానిక పోలీసులు తనపై దేశద్రోహం కేసును నమోదు చేశారని, తర్వాత లీజు మొత్తాన్ని చెల్లించలేదంటూ హెచ్‌ఐఎఎల్ కోసం ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. లడఖ్‌ను ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని, రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 10న వాంగ్ చుక్ నిరాహార దీక్షను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు దీక్ష చేపడుతున్న ఇద్దరు కార్యకర్తలు మంగళవారం ఆస్పత్రి పాలయ్యారు.
కాగా, లడఖ్‌లో ఇటీవల జరిగిన హింసాత్మక నిరసనలను తాను ప్రేరేపించానని హోం మంత్రిత్వ శాఖ చేసిన ఆరోపణను సోనమ్ వాంగ్‌చుక్ ఖండించారు. హిమాలయ ప్రాంతంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా ఉండటానికి ఉద్దేశించిన “బలిపశువు వ్యూహం” అని అభివర్ణించారు. “దీనిని నేను లేదా కొన్నిసార్లు కాంగ్రెస్ ప్రేరేపించిందని చెప్పడం, సమస్య మూలాన్ని పరిష్కరించడం కంటే బలిపశువును కనుగొనడమే. ఇది మనల్ని ఎక్కడికీ దారితీయదు” అని ఆయన పేర్కొన్నారు.
More Stories
రూ. 62,370 కోట్లతో 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు
కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోం.. త్వరలో ట్రంప్- మోదీ భేటీ
షారూక్ ఖాన్‌పై సమీర్ వాంఖడే పరువునష్టం కేసు