మదర్సా మరుగుదొడ్లలో 40 మంది బాలికలను నిర్బంధించారు. అధికారుల తనిఖీ సందర్భంగా ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో రిజిస్టర్ కాని ఆ మదర్సా కార్యకలాపాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పహల్వారా గ్రామంలోని మూడు అంతస్తుల బిల్డింగ్లో మూడేళ్లుగా మదర్సాను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.
కాగా, బుధవారం పయాగ్పూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) అశ్విని కుమార్ పాండే నేతృత్వంలోని అధికారుల బృందం తనిఖీ కోసం అక్కడకు వెళ్లింది. అయితే మదర్సా భవనం పై అంతస్తులోకి అధికారులు వెళ్లకుండా నిర్వాహకులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల సహాయంతో పై అంతస్తులోకి వెళ్లారు. టెర్రస్పై ఉన్న మరుగుదొడ్లకు తాళం వేసి ఉండటాన్ని అధికారులు గమనించి మాహిళా పోలీసుల సమక్షంలో ఆ మరుగుదొడ్ల తలుపును అధికారులు తెరిపించారు.
అందులో బంధించిన 40 మంది బాలికలు బిక్కుబిక్కుమంటూ బయటకు వచ్చారు. 9 నుంచి 14 ఏళ్ల వయస్సున్న ఆ బాలికలు భయంతో ఏమీ మాట్లాడలేదని అధికారులు తెలిపారు. కాగా, ఆ మదర్సా రిజిస్ట్రేషన్, చట్టబద్ధతను ధృవీకరించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొహమ్మద్ ఖలీద్ను కోరినట్లు ఎస్డీఎం అశ్విని కుమార్ పాండే వివరించారు.
జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహ్మద్ ఖలీద్ ప్రకారం, మదర్సా దాదాపు మూడు సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తోందని స్థానికులు తెలిపారు. “నిర్వహణాధికారులు, సిబ్బంది రిజిస్ట్రేషన్ లేదా చట్టబద్ధతకు సంబంధించిన ఎటువంటి పత్రాన్ని సమర్పించలేకపోయారు. 2023 సర్వే సమయంలో, బహ్రైచ్లో 495 నమోదు కాని మదర్సాలు గుర్తించారు. ఇది సర్వే బృందం నోటీసు నుండి తప్పించుకున్నట్లు కనిపిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇటువంటి అక్రమ మదర్సాలకు సంబంధించి స్పష్టమైన విధానాన్ని జారీ చేయలేదు.గత సంవత్సరం కొన్నింటిని సీలు చేసినప్పటికీ, వాటి నిర్వాహకులు హైకోర్టు నుండి స్టే పొందారు. ప్రభుత్వం నుండి త్వరలో కొత్త నియంత్రణ చట్రాన్ని ఆశిస్తున్నట్లు ఖలీద్ చెప్పారు.
“మదర్సాలో ఎనిమిది గదులు ఉన్నప్పటికీ బాలికలు మరుగుదొడ్ల లోపల ఎందుకు దాక్కున్నారని మేము అడిగాము. దానికి తక్సీమ్ ఫాతిమా అనే ఉపాధ్యాయుడు సమాధానమిచ్చారు. బాలికలు గందరగోళంలో భయపడి లోపల తాళం వేసుకున్నారని” ఆయన పేర్కొన్నారు. మదర్సా రికార్డులను పరిశీలిస్తున్నామని, దానిని మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.
“బాలికలను సురక్షితంగా వారి ఇళ్లకు పంపమని యాజమాన్యానికి చెప్పాము. ఇప్పుడు అందరూ ఇంటికి తిరిగి చేరుకున్నట్లు కనిపిస్తోంది” అని ఖలీద్ చెప్పారు. ఇప్పటివరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (నగరం) రామానంద్ ప్రసాద్ కుష్వాహా తెలిపారు.“తల్లిదండ్రులు, ఎస్ డి ఎం లేదా మైనారిటీ సంక్షేమ అధికారి ఇప్పటివరకు కేసు నమోదు చేయడానికి మమ్మల్ని సంప్రదించలేదు. ఏదైనా ఫిర్యాదు అందితే, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము” అని ఆయన చెప్పారు.
More Stories
ట్రంప్ కోసం గంటసేపు పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఎదురు చూపులు
రాజస్థాన్ ఎడారికి సింధూ జలాలు తరలించే మెగా ప్రాజెక్ట్
హైదరాబాద్ మెట్రో నుండి ఎల్అండ్టీ నిష్క్రమణ!