
ఐఆర్సీటీసీ కుంభకోణం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు అక్టోబర్ 13న తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలో మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లతో పాటు సహా నిందితులందరినీ తదుపరి విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టును ఒక సంస్థకు అప్పగించడంలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలున్నాయి.
ఈ విషయంలో లాలూ యాదవ్, రబ్రీ, తేజస్విపై మోసం, నేరపూరిత కుట్ర, అవినీతి ఆరోపణలు చేసినట్లు సీబీఐ ఆరోపించింది. అయితే, ఈ కేసును కొనసాగించడానికి సీబీఐ వద్ద తగిన ఆధారాలు లేవని ముగ్గురూ వాదించారు. ఈ కేసు 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న కాలం నాటిది. రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులను సుజాత హోటల్స్ అనే ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడంలో అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
సీబీఐ చార్జిషీట్ ప్రకారం 2004-2014 మధ్య పూరి, రాంచీలోని బీఎన్ఆర్ హోటల్స్‌ను భారతీయ రైల్వేల నుంచి ఐఆర్సీటీసీకి బదిలీ చేయడంలో కుట్ర జరిగిందని, ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా నిబంధనలు మార్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ హోటల్స్‌ను నిర్వహణ కోసం పాట్నాలో ఉన్న సుజాత హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చారు. నిబంధనలు మార్చడం ద్వారా సుజాత హోటల్స్‌కు అనుకూలంగా టెండర్ ప్రక్రియను తారుమారు చేశారని సీబీఐ ఆరోపించింది.
చార్జిషీట్లో ఐఆర్సీటీసీ గ్రూప్ మాజీ జనరల్ మేనేజర్లు వీకే అస్తానా, ఆర్కే గోయల్‌తో పాటు, సుజాత హోటల్స్ డైరెక్టర్లు, చాణక్య హోటల్ యజమానులు విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్ల పేర్లు కూడా ఉన్నాయి. డిలైట్ మార్కెటింగ్ కంపెనీ (ప్రస్తుతం లారా ప్రాజెక్ట్స్), సుజాత హోటల్స్‌లను ఛార్జిషీట్లో నిందితులుగా చేర్చారు.
More Stories
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్
రెండు అమెరికా కంపెనీలకు భారత సంతతి సిఇఒలు
దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లలో కస్టమ్స్ దాడులు