ఐరాసలో ట్రంప్ అసహనం.. దర్యాప్తుకు ఆదేశం

ఐరాసలో ట్రంప్ అసహనం.. దర్యాప్తుకు ఆదేశం

ఐక్యరాజ్య సమితికి మంగళవారం సతీమణి మెలానియాతో కలిసి వెళ్లిన ఆయన జనరల్‌ అసెంబ్లీ 80వ సమావేశంలో ప్రసంగించారు. అయితే, జనరల్‌ అసెంబ్లీలో ప్రసంగించేందుకు వెళ్లే క్రమంలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై ట్రంప్‌ తాజాగా స్పందిస్తూ ఐరాసలో జరిగిన వరుస సాంకేతిక ప్రమాదాలు ఉద్దేశపూర్వక విధ్వంసక చర్యలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ మేరకు ఆయా ఘటనలపై సీక్రెట్‌ సర్వీస్‌ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ట్రూత్‌లో ట్రంప్‌ పోస్టు పెట్టారు. ఐరాసలో తనకు అవమానం జరిగిందని పేర్కొన్నారు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు దురదృష్టకర ఘటనలు జరిగినట్లు చెప్పారు. ఐరాసలో ప్రసంగించేందుకు వెళ్తుంటే ఎస్కలేటర్‌ ఆగిపోయిందని పేర్కొన్నారు. 

ఆ తర్వాత టెలిప్రాంప్టర్‌ పని చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 15 నిమిషాల తర్వాత అది పనిచేయడం ప్రారంభమైనట్లు చెప్పారు. ఈ మూడు ఘటనలు దురుద్దేశ పూర్వకంగానే కనిపిస్తున్నాయని తెలిపారు. ఆయా ఘటనలపై విచారణకు ఆదేశించినట్లు ట్రంప్‌ తెలిపారు. అయితే, అదే సమయంలో తన ప్రసంగానికి మాత్రం అద్భుతమైన రివ్యూలు వచ్చినట్లు ట్రంప్‌ వివరించారు.

కాగా, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎక్కిన ఎస్కలేటర్‌ హఠాత్తుగా ఆగిపోయింది. దీనికి ట్రంప్‌ వీడియోగ్రాఫరే కారణమై ఉండవచ్చునని ఐరాస తెలిపింది. ట్రంప్‌, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ వస్తున్న దృశ్యాలను చిత్రీకరించడానికి వీడియోగ్రాఫర్‌ ఎస్కలేటర్‌పై వెనక్కి ప్రయాణించారని, పైకి చేరుకున్న తర్వాత అనుకోకుండా సేఫ్టీ ఫంక్షన్‌ను నొక్కి ఉండవచ్చునని ఐరాస ప్రతినిధి చెప్పారు. 

ఈ ఘటనను ట్రంప్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు. “ప్రథమ మహిళ సరిగా నిలబడకపోతే పడిపోయి ఉండేది” అని నవ్వుతూ పేర్కొన్నారు. అయితే ట్రంప్‌ దంపతులు ఎస్కలేటర్‌ ఎక్కగానే ఎవరో ఉద్దేశపూర్వకంగా దానిని ఆపేశారని శ్వేతసౌధం ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగంలో ఎస్కలేటర్‌ ఘటనను తేలికగా తీసుకున్న ట్రంప్‌ ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎస్కలేటర్‌ పనిచేయడం లేదని, టెలిప్రాంప్టర్‌ లోపభూయిష్టంగా ఉన్నదని ఆరోపించారు. ఈ సంఘటనను సాకుగా చూపి ఐరాసను పనిచేయని సంస్థగా ఆయన చిత్రీకరించారు. “ఐరాసలో నాకు లభించింది ఎస్కలేటర్‌ అనుభవం మాత్రమే. అది పైకి వచ్చేటప్పుడు మధ్యలోనే ఆగిపోయింది” అని చెప్పారు. కాగా అమెరికా ప్రతినిధి బృందంలోని ఓ వీడియోగ్రాఫర్‌ ఎస్కలేటర్‌ పైభాగంలోని స్టాప్‌ మెకానిజాన్ని నొక్కారని ఐరాస సెక్రటరీ జనరల్‌ ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ వివరించారు.