5 వేల గ్రామాల్లో శ్రీవారి ఆలయాలు, నిత్యాన్నదాన పథకం

5 వేల గ్రామాల్లో శ్రీవారి ఆలయాలు, నిత్యాన్నదాన పథకం

* శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని ఆలయాల్లో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం వెండి పళ్లెంలో పట్టు వస్త్రాలు తీసుకుని శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. 

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ దాదాపు 5వేల గ్రామాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టీటీడీ బోర్డుకు సూచించారు. ‘‘అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు ఉండాలి. ప్రపంచంలో హిందువులు ఉండే అన్ని ప్రాంతాల్లో స్వామి వారి ఆలయాలు నిర్మించాల్సిన అవసరముంది’’ అని చెప్పారు. మంత్రి నారా లోకేశ్‌ దంపతులు, టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, బోర్డు సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు సీఎం వెంట ఉన్నారు.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం రోజు సాయంత్రం ధ్వజారోహణతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా శ్రీవారి వాహన సేవలను ప్రారంభించారు. తొలిరోజు పెద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి తిరుమల మాడవీధుల్లో విహరించారు. కలియుగ వైకుంఠ నాథుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు జరిగే పండుగే పెద శేషవాహన ఉత్సవం.

ఆద్యంతం కన్నుల పండువగా సాగిన ఈ సేవలో శ్రీనివాసుడు శేషతల్పంపై అధిష్ఠించి దర్శనమిచ్చారు. స్వామి కొలువున్న కొండ శేషాద్రి. అందుకే తొలిరోజు పెద శేష వాహనంపై నుంచి భక్తులకు అభయ ప్రదానం చేస్తారు.  విషోగ్రుడైన శేషుని అధిష్ఠించిన దేవదేవుడు మానవుల్లోని కల్మశాన్ని హరిస్తాడన్నది ఈ సేవలోని అంతరార్థం. తిరు ఆభరణాల అలంకృతుడై ఉభయ దేవేరులతో కలగలిసి వీనులవిందు చేసే మలయప్పను దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.

కాగా, భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ దంపతులు బుధవారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకోగానే ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఈవో  అనిల్ కుమార్ సింఘాల్, టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆయనకు స్వాగతం పలికారు.  అనంతరం ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు.