లేహ్‌లో ఆందోళనల వెనుక కుట్ర.. నలుగురు మృతి

లేహ్‌లో ఆందోళనల వెనుక కుట్ర.. నలుగురు మృతి
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ లేహ్‌ నగరంలో చేపట్టిన నిరసనలు హింసకు దారి తీశాయి. ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మరణించారు. మరో 30 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. అయితే, పోలీసులు జరిపిన కాల్పుల్లోనే నలుగురు యువకులు మృతి చెందారని ఆందోళనకారులు ఆరోపించారు. గాయపడిన వారి సంఖ్య ఎక్కువ ఉందని వివరించారు.

“ఈ ఆందోళనలు యువత స్వంతంగా చేపట్టలేదు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. సోనమ్ వాంగ్చుక్ లాంటి స్వార్థ ప్రయోజనాల కోసం పాటుపడే వారికోసం లద్ధాఖ్ యువత ఉద్యమం చేస్తున్నారు. ఏబీఎల్, కేడీఏ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు హైపవర్ కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 6న కేంద్రం ఓ మీటింగ్ను ఏర్పాటు చేసింది. కొత్తగా హెచ్పీసీ సభ్యులను చేర్చుకోవాలని ఏబీఎల్ చేసిన డిమాండ్కు కేంద్రం అంగీకరించింది” అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. 

“అయితే, కొందరు దీనిని ముందుగా సెప్టెంబర్ 25-26 తేదీల్లో చేపట్టాలని కోరారు. కేంద్రం చర్చలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇదే విషయమై జూలై 25న చర్చించాం. చర్చలకు సిద్ధమని ప్రకటించినా హింసకు ఉసిగొల్పారు. అరబ్ తరహా నిరసనలు లద్ధాఖ్లో చేపట్టాలని సోనమ్ వాంగ్చుక్ ఇప్పటికే సంకేతం ఇచ్చారు. ఇటీవలె నేపాల్లో జరిగిన జెన్ జెడ్ ఆందోళనలను బ్లూ ప్రింట్గా చూపించారు” అని ఆ వర్గాలు ఆరోపించాయి. 

“ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ వేదికను వాంగ్ చుక్ వాడుకుంటున్నారు. రాళ్లు రువ్వడం, బంద్లు, విధ్వంసం సృష్టించాలని చెప్పేలా కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు ఇచ్చారు. ఇదంతా స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టిన కుట్ర” అంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

కాంగ్రెస్ కౌన్సిలర్ స్టాన్జింగ్ త్సెపాంగ్ అప్పర్ ఈ హింసకు ప్రధాన ప్రేరేపకుడు అని బిజెపి ఎంపీ సంబిత్ పాత్ర ఆరోపించారు.  అతను, అతని మద్దతుదారులు హింసను ప్రేరేపిస్తున్నట్లు అనేక ఫోటోలు బయటపడ్డాయని చెప్పారు. అతను చేతిలో ఆయుధంతో బిజెపి కార్యాలయం వైపు కవాతు చేస్తున్నట్లు కూడా చూడవచ్చని చెప్పారు.  అతను జనసమూహాన్ని రెచ్చగొడుతూ బిజెపి కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నాడని, దీనికి సంబంధించిన వీడియో కూడా బయటపడిందని వెల్లడించారు.

లద్దాఖ్‌కు రాష్ట్ర హోదాతోపాటు ఆరో షెడ్యూల్‌ పొడిగింపు డిమాండ్‌ చేస్తూ స్థానికంగా కొంతకాలంగా స్థానికంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 10 నుంచి దాదాపు 15మంది ఆమరణ దీక్షకు దిగారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమించడంతో వారిని సెప్టెంబర్‌ 23 సాయంత్రం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే లద్దాఖ్‌ అపెక్స్‌ బాడీ (ఎల్ఏబి) యువజన విభాగం తాజా నిరసనలకు పిలుపునిచ్చింది. 

దీంతో లేహ్‌ నగరంలో అనేక మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. వీరిని చెదరగొట్టేందుకు వచ్చిన భద్రతా దళాలపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. స్థానిక బీజేపీ కార్యాలయానికి, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. వీటిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులు ఫైరింగ్‌ చేసి లేహ్‌ జిల్లాలో నిషేధాజ్ఞలు విధించారు.

“ముందు జాగ్రత్తగా లేహ్ జిల్లా మొత్తం కర్ఫ్యూ విధించాం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. మృతుల సంఖ్య మరింతగా పెరగకుండా ఉండేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. హింస ఏ రకంలో ఉన్నా సహించేది లేదు” అని లడాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా హెచ్చరించారు.  “హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు, జిల్లా యంత్రాగానికి ఆదేశాలు ఇచ్చాం. శాంతి భద్రతలకు భంగం కలిగిచేందుకు ప్రయత్నిస్తున్న వారికి దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నాం” అని ఆయన హితవు చెప్పారు.

మరోవైపు లేహ్‌లో నెలకొన్న హింసపై పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాంతియుతంగా చేపట్టిన నిరసనలు ఎలాంటి ఫలితాలు ఇవ్వకపోవడంతోనే యువత నిస్పృహ చెందారని అభిప్రాయపడ్డారు. ఇవే తాజా ఘటనలకు దారితీశాయన్న ఆయన, పలువురు యువకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కాగా, ఆదివారం ప్రారంభమైన నాలుగు రోజుల వార్షిక లడఖ్ ఉత్సవం చివరి రోజు బుధవారం హింసాత్మక ఘర్షణల కారణంగా రద్దు చేయబడింది. లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా ఉత్సవ ముగింపు కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది.