
* హిమాచల్ ప్రదేశ్ పర్యావరణ వ్యవస్థపై సుప్రీంకోర్టు ఆందోళన
ఈ ఏడాది రుతుపవనాలు హిమాలయన్ రాష్ట్రాలలో అల్లకల్లోలం సృష్టించాయి. అతివృష్టి, వరదలు పోటెత్తడం, కొండచరియలు విరిగిపడటం లాంటి కారణాలతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న హిమాలయన్ పర్యావరణ వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిమాలయాల ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలు తీవ్రమైన అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించింది.
పర్యాటకం కోసం, నిర్మాణాల కోసం, మైనింగ్ కోసం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని, పర్యాటకాన్ని, నిర్మాణాలను, గనుల తవ్వకాలను నియంత్రించడం కోసం హిమాచల్‌ప్రదేశ్ అవలంభిస్తున్న విధానాలపై సర్వోన్నత న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. ఈ ఏడాది రుతుపవనాలు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. క్లౌడ్‌బరస్ట్‌లు, వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటి ఘటనలతో రెండు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఆ రెండు రాష్ట్రాల్లోని పలు పట్టణాలు, గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో అయితే ఏకంగా ఊళ్లకే ఊళ్లే కొట్టుకుపోయాయి.
ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు హిమాలయన్ రాష్ట్రాలన్నీ అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించింది. “ఈ వర్షాకాలం హిమాచల్‌ప్రదేశ్ పర్యావరణ వ్యవస్థను విధ్వంసం చేసింది. వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, పోటెత్తిన వరదలు తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం కలిగించాయి. వరదల్లో అక్కడి శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక భవనాలు, పెద్ద సంఖ్యలో ఇళ్ళు కొట్టుకుపోయాయి. కొండచరియల కింద పలు ప్రాంతాలు నలిగిపోయాయి” అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు హిమాలయన్ ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలు తీవ్రమైన అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని దుర్బలమైన పర్యావరణ పరిస్థితుల గురించి సవివరంగా కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం, అడవుల నరికివేత, పరిహార అటవీకరణ, రహదారుల నిర్మాణం, జల విద్యుత్ ప్రాజెక్టులు, మైనింగ్ ప్రాజెక్టులు, పర్యాటకానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది. మళ్లీ విచారణ జరిగే నాటికి సమగ్ర వివరాలను తెలియజేయాలని ఆదేశిస్తూ తదపరి విచారణను అక్టోబర్ 28కి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా, గత నెలలో సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్‌లో పర్యావరణ అసమతుల్యతలను పరిష్కరించడంలో సహాయపడటానికి ఒక అమికస్ క్యూరీని నియమించింది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా రాష్ట్రంలోని పర్యావరణ పరిస్థితులకు సంబంధించిన సుమోటో కేసును సమీక్షించారు. గతంలో, జూలై 28న, న్యాయమూర్తులు జె.బి. పార్దివాలా, ఆర్. మహదేవన్ నేతృత్వంలోని మరో ధర్మాసనం ప్రస్తుత పరిస్థితి మెరుగుపడకపోతే రాష్ట్రం “గాలిలో అదృశ్యం కావచ్చు” అని హెచ్చరించింది. పరిస్థితులు క్షీణించడాన్ని సుప్రీం కోర్టు గుర్తించింది. జూలైలో వాతావరణ మార్పు ఈ ప్రాంతంపై “ఆందోళనకరమైన ప్రభావాన్ని” చూపుతోందని వ్యాఖ్యానించింది.
కొన్ని ప్రాంతాలను “పచ్చని ప్రాంతం”గా పేర్కొంటూ జూన్ 2025లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా అప్పీల్‌ను కొట్టివేసిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కూడా కోర్టు పరిష్కరిస్తోంది. హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ, ఆ ప్రాంతాలలో నిర్మాణ కార్యకలాపాలను పరిమితం చేయడం ఈ నోటిఫికేషన్ లక్ష్యం అని గుర్తించింది. రాష్ట్ర పర్యావరణ క్షీణతకు ప్రధాన కారణాలను జలవిద్యుత్ ప్రాజెక్టులు, నాలుగు లేన్ల రోడ్లు, అటవీ నిర్మూలన, బహుళ అంతస్తుల భవనాలుగా నిపుణులు, వివిధ నివేదికలు గుర్తించాయని ధర్మాసనం ప్రస్తావించింది.
More Stories
జమ్మూ కాశ్మీర్లో లో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక
భారత్ లో మహిళల ప్రాముఖ్యతకు నిదర్శనం నవరాత్రి
ఇంధన ఎనర్జీ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలు