అన్ని రంగాల్లోనూ స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించాలి

అన్ని రంగాల్లోనూ స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించాలి

అన్ని రంగాల్లోనూ స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్ తన భవిష్యత్ ప్రయాణంలో స్వదేశీ ఆర్థిక వ్యవస్థగా మారడంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. దేశంలో వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి తమ ప్రభుత్వం అనవసరమైన నిబంధనలను తొలగించిందని వెల్లడించారు.  ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ తయారీకి ప్రాధాన్యత ఇస్తోందని,  చిప్ నుంచి షిప్ వరకు ప్రతిదీ భారత్​లోనే తయారు చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.

ఉత్తర్​ప్రదేశ్ అంతర్జాతీయ ట్రేడ్ షో-2025ను ప్రధాని మోదీ గ్రేటర్ నోయిడాలో ప్రారంభిస్తూ  “వ్యాపారులకు ఇబ్బందికరంగా మారిన 40,000 కంటే ఎక్కువ నిబంధనలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. వెయ్యికి పైగా చట్టాలను నేరరహితం చేసింది” అని గుర్తు చేశారు. 

“ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు, అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశ వృద్ధి ఆకర్షణీయంగా ఉంది. అంతరాయాలు భారత్​కు ఆటంకం కలిగించలేవు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా భారత్ రాబోయే దశాబ్దాలకు ఆర్థిక పునాదులను బలోపేతం చేస్తోంది. భారతదేశ సంకల్పం, మంత్రం ఆత్మనిర్భర్ భారత్. ఇతరులపై ఆధారపడటం కంటే నిస్సహాయత మరొకటేమి లేదు” అని స్పష్టం చేశారు. 

“ఒక దేశం ఇతర దేశాలపై ఎంత ఎక్కువగా ఆధారపడితే దాని వృద్ధి కుంటుపడుతుంది. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను నెరవేర్చాలి. ప్రపంచంలో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. తన సొంత అభివృద్ధి కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని ఇకపై అంగీకరించదు అని ప్రధాని తేల్చి చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తుల విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని పేర్కొంటూ  ప్రతి పౌరుడు స్వదేశీ మంత్రాన్ని అవలంభిస్తున్నారని, వ్యాపారులు ఈ మంత్రాన్ని గర్వంగా స్వీకరించాలని ప్రధాని కోరారు.

స్వదేశీ డిజైన్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితులను సృష్టించాలని చెప్పారు. పరిశోధనా రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.  ఆవిష్కరణలు జరగకపోతే ప్రపంచం ముందుకు సాగదని, అలాగే వ్యాపారాలు ఆగిపోతాయని ప్రధాని హెచ్చరించారు. నేడు దీన్‌ దయాళ్ ఉపాధ్యాయ జయంతి అని, ఆయన మనకు అంత్యోదయ మార్గాన్ని చూపించారని కొనియాడారు. అంటే ఆఖరి వరుసలో ఉన్న వారికి అభివృద్ధి ఫలాలు చేరాలని ఉపాధ్యాయ సామాజిక సందేశాన్ని ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

ఫిన్‌ టెక్ రంగంలో తీసుకున్న కొన్ని మైలురాయి కార్యక్రమాల ద్వారా భారత్ పురోగతిని చూస్తోందని ప్రధాని తెలిపారు.  “భారత్ ఫిన్‌ టెక్ రంగం సమ్మిళిత అభివృద్ధిని బలోపేతం చేసింది. యూపీఐ, ఆధార్ వంటి ఆవిష్కరణలు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. మాల్‌ లో షాపింగ్ చేసినా లేదా టీ విక్రేత అయినా వారిద్దరూ యూపీఐని ఉపయోగిస్తున్నారు” అని ప్రధాని చెప్పారు. 

“భారత్​లో మ్యాన్యుఫ్యాక్చరింగ్ అయ్యే మొత్తం ఫోన్లలో 55 శాతం ఉత్తర్​ప్రదేశ్​లోనే తయారవుతున్నాయి. సెమీకండక్టర్ రంగంలో దేశ స్వావలంబనను యూపీ బలోపేతం చేస్తుంది. మన దళాలు ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నాయి. మనం భారత్​లో ఒక శక్తివంతమైన రక్షణ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అతి త్వరలో రష్యా సహాయంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో ఏకే-203 రైఫిల్స్ తయారీని ప్రారంభిస్తాం. యూపీలో ఒక రక్షణ కారిడార్ ను నిర్మిస్తాం” అని ప్రధాని మోదీ వెల్లడించారు.

అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడటంతో ప్రజలపై పన్ను భారం మరింత తగ్గుతుందని ప్రధాని మోదీ తెలిపారు. జీఎస్టీ సంస్కరణల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంటూ జీఎస్టీలో ఇటీవలి నిర్మాణాత్మక సంస్కరణలు దేశ వృద్ధికి కొత్త రెక్కలు తొడిగాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశకు ఒక ముఖ్యమైన అడుగుగా 2017లో జీఎస్టీని అమలు చేశామని పేర్కొన్నారు. 

దీన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం పరోక్ష పన్ను విధానంలో సంస్కరణలను ప్రవేశపెట్టిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది సెప్టెంబర్​లో జీఎస్టీ విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు.  “మనం ఇక్కడితో ఆగబోవడం లేదు. ఆర్థిక వ్యవస్థ మరింత బలపడటంతో పన్ను భారం తగ్గుతూనే ఉంటుంది. దేశ ప్రజల ఆశీర్వాదాలతో జీఎస్టీలో సంస్కరణలు కొనసాగుతాయి. దేశం ఒక శక్తివంతమైన రక్షణ రంగాన్ని అభివృద్ధి చేస్తోంది. భారత్ స్వావలంబన సాధించాలి. పరిశోధన, ఆవిష్కరణలలో పెట్టుబడులను పెంచాలి” అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.