పీసీబీపై చర్యలు తీసుకోవాలన్న సునీల్‌ గవాస్కర్‌

పీసీబీపై చర్యలు తీసుకోవాలన్న సునీల్‌ గవాస్కర్‌
ఆసియాకప్‌లో భాగంగా భారత్‌- పాకిస్తాన్‌ మధ్య చెలరేగిన షేక్‌ హ్యాండ్‌ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. కెప్టెన్‌ సూర్య కుమార్‌ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచుల్లోనూ కరచాలనం చేసేందుకు నిరాకరించింది. గ్రూప్‌ దశ మ్యాచ్‌ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. 
 
అయితే, ఈ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. తాజాగా భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాక్‌పై విమర్శలు గుప్పించారు. పీసీబీ చేసిన ఫిర్యాదు అర్థం లేనిదని, ఎందుకంటే నిబంధనల్లో ఎక్కడా షేక్‌ హ్యాండ్‌ తప్పనిసరి అని పేర్కొనలేదు అని గుర్తు చేశారు.  క్రీడల్లో జట్లు మ్యాచుల తర్వాత కరచాలనం చేయని సందర్భాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 
 
నిజంగా పీసీబీ ఫిర్యాదు చేసి ఉంటే ఐసీసీ తిరస్కరించడం సరైందేనని ఆయన సమర్ధించారు. కరచాలనం వివాదంతో పాటు ప్రెస్‌మీట్‌కు హాజరయ్యేందుకు పాక్‌ నిరాకరించడంపై ప్రశ్నలు లేవనెత్తారు గవాస్కర్‌. పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు తప్పనిసరి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కెప్టెన్, ఆటగాళ్లు, కోచ్‌ను పంపాల్సిన అవసరం లేదని, వారి సీనియర్ సపోర్ట్ స్టాఫ్‌లోని ఎవరైనా మీడియాతో మాట్లాడి ఉండవచ్చని తెలిపారు. 
 
ఈ ఉల్లంఘనకు ఏదైనా చర్య తీసుకుంటారా? లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుందని పేర్కొన్నారు. యూఏఈతో మ్యాచ్ ప్రారంభ మ్యాచ్‌ ఆలస్యంగా మొదలుకావడంపై గవాస్కర్‌ తీవ్రంగా స్పందించారు. ఒక గంట మ్యాచ్‌ను ఆలస్యంగా ప్రారంభించడం తప్పని మండిపడ్డారు. మ్యాచ్ రిఫరీతో పీసీబీకి ఏవైనా ఫిర్యాదులు ఉంటే భారత్‌ చేతిలో ఓడిపోయిన తర్వాత ఆ సమస్యను లేవనెత్తడానికి వారికి రెండు పూర్తి రోజులు సమయం ఉంటుందని తెలిపారు. 
 
కానీ టాస్ వేసే ముందు వరకు మైదానంలోకి రాకుండా మొత్తం మ్యాచ్‌ను వారు తాకట్టు పెట్టారని స్పోర్ట్స్‌ కాలామ్‌లో విమర్శించారు. క్రికెట్ చట్టాల్లో ఎక్కడా మ్యాచ్ రిఫరీ క్షమాపణ చెప్పాలని పేర్కొనలేదని గవాస్కర్ గుర్తు చేశారు. మ్యాచ్ ప్రారంభం ఆలస్యం కావడానికి ఎలాంటి కారణం లేదని,  ఐసీసీ క్షమాపణ చెప్పలేదని స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు.