టెక్సాస్‌లోని హ‌నుమాన్ విగ్ర‌హంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

టెక్సాస్‌లోని హ‌నుమాన్ విగ్ర‌హంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో సుమారు 90 అడుగుల ఎత్తైన హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ఇటీవ‌ల ప్ర‌తిష్టించారు. అయితే ఆ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల ఆ రాష్ట్రానికి చెందిన రిప‌బ్లిక‌న్ నేత అలెగ్జాండ‌ర్ డంక‌న్‌ త‌ప్పుప‌ట్టారు. అమెరికా అంటే క్రైస్త‌వుల‌కు చెందిన దేశ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.  టెక్సాస్‌లోని సుఘ‌ర్ ల్యాండ్ ప‌ట్ట‌ణంలో ఉన్న శ్రీ అష్ట‌ల‌క్ష్మీ ఆల‌య ప‌రిస‌రాల్లో స్టాచ్యూ ఆఫ్ యూనియ‌న్ పేరుతో భారీ హ‌నుమంతుడి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. చిన్న‌య‌జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో ఆ విగ్ర‌హాన్ని స్థాపించారు. 

హిందువులు ఆరాధించే ఆంజ‌నేయుడి విగ్ర‌హ ఏర్పాట్ల ప‌ట్ల రిప‌బ్లిక‌న్ నేత అలెగ్జాండ‌ర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.  హిందువులు పూజించే దేవుడు న‌కిలీ అని, ఆ దేవుడి విగ్ర‌హాన్ని ఎందుకు టెక్సాస్‌లో ఏర్పాటు చేశార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇది క్రైస్త‌వులు ఉండే దేశ‌మ‌ని త‌న ఎక్స్ అకౌంట్‌లో ఆయ‌న పోస్టు చేశారు. సుఘ‌ర్ ల్యాండ్‌లో ఉన్న విగ్ర‌హానికి చెందిన వీడియోను కూడా షేర్ చేశారాయ‌న‌.

మ‌రో సోష‌ల్ మీడియా పోస్టులో ఆయ‌న బైబిల్ సూక్తిని వ్యాఖ్యానించారు. నేను, త‌ప్ప మ‌రో భ‌గ‌వంతుడి మీకు లేర‌ని, మీరెవ‌రు కూడా మ‌రొక‌రి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌రాదు అని, ఎటువంటి చిత్రాన్ని పెట్ట‌వ‌ద్ద‌ని బైబిల్‌లో చెప్పిన సూక్తిని ఆయ‌న వ‌ల్లించారు.

రిప‌బ్లిక‌న్ నేత డంక‌న్ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. హిందూ అమెరిక‌న్ ఫౌండేష‌న్ ఆ ప్రకటనను ఖండించింది. హిందువుల‌కు వ్య‌తిరేకంగా,రెచ్చ‌గొట్టే రీతిలో ఉన్న‌ట్లు హెచ్ఏఎఫ్ ఆరోపించింది. టెక్సాస్‌లో ఉన్న రిప‌బ్లిక‌న్ పార్టీకి ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఫిర్యాదు కూడా చేశామ‌ని తెలిపారు. ఏ మ‌తాన్నైనా అవ‌లంబించే స్వేచ్ఛ‌ను అమెరికా రాజ్యాంగ క‌ల్పించింద‌ని స్పష్టం చేశారు.

డంక‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఓ ఎక్స్ యూజ‌ర్ త‌ప్పుప‌ట్టారు. మీరు హిందువు కానంత మాత్రాన‌, దేవుడు త‌ప్పుడు కాలేడ‌ని మండిపడ్డారు. భూమిపై ఏసుక్రీస్తు పుట్ట‌డానికి రెండు వేల ఏళ్ల క్రిత‌మే వేదాల‌ను ర‌చించార‌ని, అవి అసాధార‌ణ గ్రంధాల‌ని తెలిపారు. ఆ గ్రంధాల ప్ర‌భావం క్రైస్త‌వంపై ఉన్న‌ద‌ని, అందుకే ఆ మ‌తానికి ప్రాధాన్య‌త, గౌర‌వాన్ని ఇచ్చి దాన్ని అధ్య‌య‌నం చేయ‌డం ఉత్త‌మం అని జోర్డ‌న్ హితవు చెప్పారు.