ప్రజారోగ్య రంగంలో ఆయుష్మాన్ భారత్ ఓ విప్లవం

ప్రజారోగ్య రంగంలో ఆయుష్మాన్ భారత్ ఓ విప్లవం

పేద, ధనిక తేడా లేకుండా ప్రజలందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ఓ విప్లవమని  ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ పథకం ప్రజారోగ్య రంగంలో విప్లవాన్ని సృష్టించిందని, లబ్ధిదారులకు ఆర్థిక రక్షణ, గౌరవాన్ని నిర్ధరిస్తుందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ అమల్లోకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తి కాగా, మోదీ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

“నేటితో మనం ఆయుష్మాన్ భారత్ పథకం మొదలుపెట్టి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇది భవిష్యత్తు అవసరాలను ముందుగానే ఊహించి, ప్రజలకు అత్యున్నత నాణ్యతతో పాటు సరసమైన ఆరోగ్య సంరక్షణను నిర్ధరించడంపై దృష్టి సారించి తీసుకున్న ఒక చొరవ. భారత్ ప్రజారోగ్య రంగంలో ఒక విప్లవాన్ని చూస్తోంది. ఆయుష్మాన్ భారత్ ఆర్థిక రక్షణ, గౌరవాన్ని నిర్ధరించింది” అని మోదీ తెలిపారు.

“సాంకేతికత, మానవ సాధికారతను భారత్ ఎలా మరింత ముందుకు తీసుకువెళుతుందో ఆ పథకం ప్రపంచానికి చూపించింది” అని మోదీ పేర్కొన్నారు. కాగా, ఆయుష్మాన్ భారత్ పథకం 55 కోట్లకు పైగా పౌరులకు వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య హామీ పథకంగా ప్రశంసించింది. ఇప్పటివరకు 42 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయని చెప్పింది.

ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల ప్రభుత్వ ఆరోగ్య వ్యయం 29 శాతం నుంచి 48 శాతానికి పెరిగిందని, ప్రజల ఖర్చు 63 శాతం నుంచి 39 శాతానికి తగ్గిందని చెప్పింది. అనారోగ్యం సమయంలో లక్షలాది కుటుంబాలను రక్షించిందని వెల్లడించింది. అనారోగ్యం వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే థ్యేయంతో మొదలుపెట్టామని తెలిపింది. ఏటా ఆరు కోట్లకు పైగా కుటుంబాలను రక్షించిందని పేర్కొంది.

యుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా (ఎబి పీఎంజేఎవై) పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో కేంద్రం లాంఛనంగా ప్రారంభించింది. ఆయుష్మాన్‌ కార్డు ఉన్న వృద్ధులు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధి పొందుతారు. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్యబీమా లభిస్తుంది. దీనికింద దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు అందిస్తారు. ఇప్పటికే ఆయుష్మాన్‌భారత్‌ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. 

కుటుంబంలో 70 ఏళ్ల పైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం వర్తిస్తుంది. సీజీహెచ్‌ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌స్కీం, ఆయుష్మాన్‌ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ పథకాల కింద ఉన్న వయోవృద్ధులు వాటిని గానీ, ఏబీపీఎంజేఏవైని గానీ ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారూ ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు వైద్య సేవలు ఉచితం.