సొంత ప్రజలపై పాక్ బాంబులు, ఉగ్రవాదులకు ఆశ్రయం 

సొంత ప్రజలపై పాక్ బాంబులు, ఉగ్రవాదులకు ఆశ్రయం 

* ఐరాస వేదికగా పాక్ నిజస్వరూపాన్ని బయటపెట్టిన భారత్

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి వేదికగా పాకిస్థాన్‌ నిజస్వరూపాన్ని భారత్ బయటపెట్టింది. ఒకరోజు కిందటే ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని సొంత ప్రజలపై పాకిస్థాన్ బాంబులు వేసిందని గుర్తుచేసింది. పాక్ వాయుసేన చేసిన ఈ దాడిలో 30 మంది పాకిస్థానీ పౌరులు ప్రాణాలు కోల్పోయారని భారత్ తెలిపింది. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారని చెప్పింది. 

యూఎన్‌హెచ్‌ఆర్‌సీ 60వ సదస్సులో ప్రసంగిస్తూ భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి  సొంత ప్రజలను దారుణంగా పీడిస్తున్న మచ్చలతో పాకిస్థాన్ మానవ హక్కుల రికార్డు నిండిపోయిందని ధ్వజమెత్తారు. ఈ రికార్డును సరిచేసుకోవడంతో పాటు ఐసీయూ దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడంపై దృష్టి సారించాలని పాక్‌కు ఆయన హితవు పలికారు. 

యూఎన్‌హెచ్‌ఆర్‌సీ లాంటి అంతర్జాతీయ వేదికల నుంచి భారత్‌పై నిరాధారమైన, కవ్వించేలా ఉండే ఆరోపణలు చేయడాన్ని ఆపాలని పాక్‌కు క్షితిజ్ త్యాగి సూచించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, సొంత ప్రజలపైనే బాంబులు వేసుకుంటున్న పాకిస్థాన్‌కు భారత్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు.

‘‘మా దేశ భూభాగం కోసం పాకులాడే ప్రక్రియను ఇకనైనా పాక్ ఆపేయాలి. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న భారతదేశ భూభాగాన్ని వదిలేయాలి. దారుణ సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే ప్రయత్నాలపై పాక్ దృష్టి సారించడం మంచిది” అని హితవు చెప్పారు. త్యాగి స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న భారతదేశ శాశ్వత మిషన్ కౌన్సెలర్‌గా వ్యవహరిస్తున్నారు.

“పాకిస్థాన్ రాజకీయాలపై సైన్యం ప్రభావం చాలా ఉంది. అక్కడ మానవ హక్కులకు రక్షణ లేకుండాపోయింది. ఉగ్రవాదాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో పాటు ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని ఇచ్చే పనిని పాక్ చేస్తోంది. సొంత ప్రజలపైనా బాంబులు వేసుకుంటోంది’’ అని  క్షితిజ్ త్యాగి ఆరోపించారు.

ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాపై దాడి!

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌‌లో తాలిబన్ల సానుభూతిపరులైన తెహ్రీక్ ఏ తాలిబన్ (టీటీపీ) ఉగ్రవాదుల ప్రాబల్యం పెరుగుతుంది. గతంలో పలుమార్లు ఈ ఉగ్రవాదులు చేసిన భీకర దాడుల్లో చాలామంది పాక్ సైనికులు, పౌరులు చనిపోయారు.  ఈనేపథ్యంలో టీటీపీ ఉగ్రవాదులు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌‌లోని తిరా లోయలో ఉన్న మాత్రే దరా గ్రామంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దాచి ఉంచారనే సమాచారం పాక్ సైన్యానికి అందిందని మీడియాలో కథనాలు వచ్చాయి. 

ఈ సమాచారం ఆధారంగా సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు తిరా లోయలో చైనాకు చెందిన జే-17 యుద్ధ విమానాల నుంచి పాక్ వాయుసేన లేజర్ గైడెడ్ బాంబులను జారవిడిచింది. ఈ దాడిలో 30 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో టీటీపీ ఉగ్రవాదులు కూడా ఉన్నారని పాక్ మీడియా అంటోంది.

తాజా దాడి తర్వాత పాక్ సైన్యంపై ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉగ్రవాదం వల్ల తాము చాలా నష్టపోయామని, ఇప్పుడు సైన్యం కూడా తమపై దాడులు చేస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ఇదే అంశంపై గతవారం ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌‌లోని మిన్ గోరా ప్రాంతంలో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు.

తాము శాంతిని కోరుకుంటున్నామని నినదించారు. ఇలాంటి దాడుల వల్ల ప్రజల మనసుల్లో ద్వేషపు బీజాలు పడతాయే తప్ప ఇంకేమీ మిగలదని పేర్కొంటూ పాకిస్థాన్ ప్రధాన విపక్ష పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేసింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌‌ మొత్తం కొండలతో నిండి ఉంటుంది. ఈ కొండల్లోనే వివిధ ఉగ్రవాద సంస్థలు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. వాటిని ఎదుర్కోవడం, ఏరిపారేయడం ప్రస్తుతం పాక్‌కు పెద్దసవాల్‌గా మారింది.