మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
* ఢిల్లీలో 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం

71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలతోపాటు ప్రశంసా పత్రాలు అందజేశారు.  భారత చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును 2023 ఏడాదికిగాను రాష్ట్రపతి చేతుల మీదుగా మలయాళ నటుడు మోహన్‌లాల్ అందుకున్నారు. 

జాతీయ ఉత్తమ నటుడి అవార్డును షారుక్‌ ఖాన్, విక్రాంత్‌ మైసీ అందుకున్నారు. జవాన్ చిత్రానికిగానూ షారూక్ అవార్డు అందుకోగా 12వ ఫెయిల్‌ చిత్రానికిగానూ విక్రాంత్‌ మెస్సే పురస్కారం అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ అవార్డును అందుకున్నారు.  మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే-హిందీ సినిమాలో నటనకు రాణీ ముఖర్జీకీ ఈ అవార్డు వరించింది. ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌ అవార్డును 12th ఫెయిల్ చిత్ర బృందం అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా “ది కేరళ స్టోరీని” తెరకెక్కించిన సుదీప్తో సేన్‌ అవార్డు దక్కించుకున్నారు.

“నేను మలయాళ సినిమా పరిశ్రమకు కృతజ్ఞతలు చెబుతున్నాను. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నా ఒక్కడిది కాదు. మొత్తం మలయాళం పరిశ్రమకు చెందినది. అందుకే ఈ అవార్డును దానికి అంకితం చేస్తున్నాను. ఈ రోజు నిజం అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ ఇది మాయలా ఉంది. కానీ ఇది పవిత్రమైనది. నన్ను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు, భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. సినిమా నా ఆత్మకు ప్రతీక. అది నా హృదయ స్పందన”  అని మోహన్ లాల్ ఈ సందర్భంగా తెలిపారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడిగా (65 ఏళ్లు) మోహన్లాల్ నిలిచారు. అదూర్ గోపాలకృష్ణన్ తర్వాత ఈ అవార్డు గెలుచుకున్న రెండో మలయాళీ కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా మోహన్లాల్ 4 దశాబ్దాల సినీ జీవితాన్ని ఒక దృశ్యరూపంలో ప్రదర్శించారు. మోహన్లాల్ గతంలో పద్మశ్రీ (2001), పద్మభూషణ్ (2019) పురస్కారాలు పొందారు. ఇక ఐదు సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు పొందారు.

తెలుగు చిత్రాలకు అవార్డులు

ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరికి వచ్చిన అవార్డును ఆ చిత్ర నిర్మాత సాహు గారపాటి అందుకున్నారు. ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు హనుమాన్ సినిమాకు రాగా, నిర్మాత నిరంజన్‌రెడ్డి, దర్శకుడు ప్రశాంత వర్మ ఆ అవార్డును స్వీకరించారు.  తెలుగులో బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా గాంధీతాత చెట్టు సినిమాకుగానూ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా బేబీ సినిమాకు పీఎన్వీఎస్ రోహిత్‌ అవార్డు అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్‌ప్లే ఒరిజినల్‌ తెలుగు విభాగంలో బేబీ చిత్ర బృందం అవార్డు అందుకుంది.

  • దాదాసాహెబ్‌ ఫాల్కే – మోహన్‌లాల్
  • జాతీయ ఉత్తమ నటుడు – షారుక్ ఖాన్ (జవాన్)
  • జాతీయ ఉత్తమ నటుడు – విక్రాంత్‌ మస్సే (12th ఫెయిల్‌ )
  • జాతీయ ఉత్తమ నటి – రాణి ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే )
  • జాతీయ ఉత్తమ దర్శకుడు – సుదీప్తో సేన్‌ (ది కేరళ స్టోరీ)
  • ఉత్తమ సంగీత దర్శకుడు – ప్రణీల్‌ దేశాయ్‌ (ద ఫస్ట్‌ ఫిల్మ్‌)
  • జాతీయ ఉత్తమ చిత్రం – 12th ఫెయిల్‌
  • (12th ఫెయిల్‌ చిత్రానికి అవార్డు అందుకున్న దర్శకుడు విధు వినోద్‌ చోప్రా)
  • ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌ – పృథ్వీ, నందురాజ్‌ (హనుమాన్‌)
  • ఉత్తమ దర్శకుడు – పీయూష్‌ ఠాకూర్‌ (ద ఫస్ట్‌ ఫిల్మ్‌)
  • ఉత్తమ సంగీత దర్శకుడు – ప్రణీల్‌ దేశాయ్‌ (ద ఫస్ట్‌ ఫిల్మ్‌)
  • ‘ఊరూ పల్లెటూరు’ గేయ రచయిత – కాసర్ల శ్యామ్‌ (బలగం)
  • ఉత్తమ స్క్రీన్ప్లే – సాయి రాజేశ్ (బేబీ)
  • ఉత్తమ గాయకుడు – సాయి రోహిత్ (బేబీ)
  • ఉత్తమ బాలనటి – సుకృతి వేణి (గాంధీతాత చెట్టు)
  • ఉత్తమ యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ – వెంకట్‌ కుమార్‌ (హనుమాన్)
  • ఏవీజీసీ విభాగంలో ఉత్తమ చిత్రం – హనుమాన్‌
  • (ఏవీజీసీ విభాగంలో అవార్డు అందుకున్న హనుమాన్ నిర్మాత నిరంజన్‌ రెడ్డి, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ)
  • ఉత్తమ నేపథ్య సంగీతం- హర్షవర్ధన్ రామేశ్వర్‌ (యానిమల్‌)