మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ రూ.7.44కోట్ల ఆస్తుల జప్తు

మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ రూ.7.44కోట్ల ఆస్తుల జప్తు
ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌తో సంబంధం ఉన్న కంపెనీల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ చట్టం కింద జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.7.44 కోట్లు ఉంటుందని అంచనా. సత్యేంద్ర జైన్, ఆయన సతీమణి పూనమ్ జైన్‌తో పలువురుపై ఢిల్లీలో ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తును ప్రారంభించింది. 
 
డిసెంబర్ 3, 2018న సీబీఐ సత్యేంద్ర జైన్, పూనమ్ జైన్, ఇతరులపై చార్జిషీట్ దాఖలు మార్చి 31, 2022న సత్యేందర్‌ జైన్ యాజమాన్యంలోని, నియంత్రణలో ఉన్న కంపెనీలకు చెందిన రూ.4.81 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.  ఆ తర్వాత జూలై 27, 2022న ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలైంది.  కోర్టు 29.07.2022న పీసీని పరిగణనలోకి తీసుకుంది.
ఈడీ దర్యాప్తులో నవంబర్ 2016 నోట్ల రద్దు తర్వాత వెంటనే సత్యేంద్ర జైన్, అంకుష్ జైన్, వైభవ్ జైన్, 2016 ఆదాయ వెల్లడి పథకం కింద ముందస్తు పన్నుగా భోగల్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో రూ.7.44 కోట్ల నగదును డిపాజిట్ చేశారని తేలింది. 2011-2016 మధ్య అందుకున్న మొత్తం రూ.16.53 కోట్ల మొత్తాలు  అకిన్చాన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్,  ప్రయాస్ ఇన్ఫోసొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మంగళయాతన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో మెటల్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినవని వెల్లడైంది.

ఆయా సంస్థలు సత్యేంద జైన్ యాజమాన్యం, నియంత్రణలో ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ, ఢిల్లీ హైకోర్టు అంకుష్ జైన్, వైభవ్ జైన్‌లను సత్యేంద్ర కుమార్ జైన్ బినామీ హోల్డర్లుగా నిర్ధారించింది. ఈ సమాచారాన్ని ఈడీ, పీఎంఎల్‌ఏ, 2002 సెక్షన్ 66(2) కింద సీబీఐతో పంచుకుంది. ఈ సమాచారం ఆధారంగా సీబీఐ కేసును మరింత దర్యాప్తు చేసింది. 

ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాలంలో సత్యేంద్ర జైన్ సంపాదించిన ఆస్తులను వివరిస్తూ అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సీబీఐ అనుబంధ ఛార్జ్ షీట్ తర్వాత ఈడీ రూ.7.44 కోట్ల విలువైన స్థిరాస్తులను గుర్తించి అటాచ్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ మొత్తం రూ.12.25 కోట్లు అటాచ్‌ చేసింది. ఈ కేసులో ఈడీ త్వరలోనే అనుబంధ ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదు దాఖలు చేయనున్నది. ఈ కేసు విచారణ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో జరుగుతోంది.