రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌
దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోస్‌ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ మంగళవారం సమావేశమైంది. 10.91లక్షల మంది ఉద్యోగులకు రూ.1865.68 కోట్ల బోనస్‌ చెల్లించనున్నది.  ఈ సందర్భంగా కేంబినెట్‌ బిహార్‌లో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. తర్వలోనే బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. 
ఈ క్రమంలో రూ.2,192 కోట్లతో రైల్వే డబ్లింగ్‌కు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. భక్తియార్‌పూర్‌-రాజ్‌గిర్‌-తిలయ్యా రైల్వేలైన్‌కు ఆమోదించింది.  అలాగే, రూ.3,822.31 కోట్లతో నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా, గతేడాది దాదాపు 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు కేంద్రం బోనస్‌ ఇచ్చింది. మోదీ ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్‌ను ఆమోదించింది.  అర్హత కలిగిన రైల్వే ఉద్యోగికి 78 రోజులకు గరిష్టంగా రూ.17,951 చెల్లించనున్నారు. 

ఈ మొత్తాన్ని వివిధ రకాల రైల్వే ఉద్యోగులకు ఇవ్వనున్నారు. ఇందులో ట్రాక్ మెయింటెయినర్లు, లోకోమోటివ్ పైలట్లు, రైలు మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్‌మెన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్‌ సీ ఉద్యోగులు ఉన్నారు.  2024-25 సంవత్సరంలో రైల్వేల పనితీరు చాలా బాగుంది. రైల్వేలు రికార్డు స్థాయిలో 1614.90 మిలియన్ టన్నుల సరుకును.. దాదాపు 7.3 బిలియన్ల ప్రయాణికులను రవాణా చేశాయని ప్రభుత్వం తెలిపింది. నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్‌కు కేంద్ర మంత్రి కూడా ఆమోదం తెలిపారని వైష్ణవ్ వెల్లడించారు.