
మలయాళం స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలపై కస్టమ్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడులు మంగళవారం కొచ్చిలో పృథ్వీరాజ్ థేవరాలోని ఇంట్లో, అలాగే దుల్కర్ సల్మాన్ పనమ్పిల్లి నగర్‌లోని ఇంట్లో జరిగాయి. పృథ్వీరాజ్ తిరువనంతపురంలోని ఇంటిని కూడా అధికారులు తనిఖీ నిర్వహించారు. భూటాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా లగ్జరీ కార్లను స్మగ్లింగ్ చేస్తున్న ఒక పెద్ద నెట్‌వర్క్‌పై కస్టమ్స్ అధికారులు దేశవ్యాప్తంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రముఖుల ఇళ్లపై దాడులు చేపట్టారు. కేరళలోని కొచ్చి, కోజికోడ్, మలప్పురంతో సహా దాదాపు 30 ప్రాంతాల్లో ఈ దాడులను ఏకకాలంలో కస్టమ్స్ అధికారులు చేపట్టారు. ఈ ఆపరేషన్‌కు ‘నమ్కూర్’ అని పేరు పెట్టారు. భూటాన్ సైన్యం ఉపయోగించిన లగ్జరీ కార్లను వేలంలో తక్కువ ధరలకు విక్రయించారు. అయితే ఈ పాత వాహనాలను కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండా భారత్‌లోకి అక్రమంగా తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది.
దీంతో దేశ వ్యాప్తంగా పలువురు, సినీ , రాజకీయ, వ్యాపార ప్రముఖుల నివాసాలపై కస్టమ్స్ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ హై-ఎండ్ వాహనాలను ముందుగా హిమాచల్ ప్రదేశ్‌కు అక్రమంగా రవాణా చేసి, అక్కడ తాత్కాలిక చిరునామాలతో రిజిస్టర్ చేసుకుంటారు ఈ లగ్జరీ కార్ల ముఠా. ఆ తర్వాత వీటిని ప్రముఖ సినీ నటులు, వ్యాపారవేత్తలకు ఓ ముఠా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ రవాణా కోసం ఏజెంట్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారని అధికారులు తెలిపారు.
భూటాన్- భారత్ మధ్య ఉన్న వ్యాపార ఒప్పందాల్లోని లోసుగులను ఉపయోగించుకుని ఈ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారని సమాచారం. భూటాన్‌లో ఈ వాహనాలను వేలంలో కొనడం చట్టబద్ధమే అయినప్పటికీ, భారత్‌లోకి సరైన పన్నులు చెల్లించకుండా తీసుకువచ్చి అమ్మడం కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతోందని అధికారులు తెలిపారు.
ఈ ఆపరేషన్ కేరళ, లక్షద్వీప్ కమిషనర్ పర్యవేక్షణలో జరుగుతోంది. సినీనటుల ఇళ్లతో పాటు కలమస్సేరిలోని వ్యాపారవేత్తల నివాసాలు, మలప్పురం, కోజికోడ్‌లోని కార్ డీలర్‌షిప్‌లపై కూడా అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ వాహనాలను కొనుగోలు చేసిన వారి జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఆ జాబితాలోని ప్రముఖుల ఇళ్లలో సోదాలు చేసి, నిజానిజాలను నిర్ధారించుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
More Stories
మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ రూ.7.44కోట్ల ఆస్తుల జప్తు
ప్రభుత్వ నిధులతో దీపావళి బహుమతులు ఇవ్వొద్దు
2026 నాటికి భారత్ కు ఎస్-400 డెలివరీ పూర్తి