
కేంద్ర ప్రభుత్వం ఈ దీపావళి సందర్భంగా ప్రభుత్వ నిధుల దుర్వినియోగంను అరికట్టడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏ విధమైన బహుమతులు లేదా మర్యాదపూర్వక కానుకలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వ నిధులను ఉపయోగించరాదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిర్ణయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయాల విభాగం ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలకు ఒక సందేశాన్ని పంపింది. అందులో, ప్రభుత్వ నిధులతో స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ లేదా ఇతర బహుమతులు కొనుగోలు చేయడాన్ని ఖచ్చితంగా నిషేధించారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, ప్రజాధనం సరైన మార్గంలో ఉపయోగపడేలా చూడటం వంటి లక్ష్యాలతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ చర్య ప్రభుత్వ యంత్రాంగంలో ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా భావించవచ్చని భావిస్తున్నారు. ఇది కేవలం ఒక తాత్కాలిక నిర్ణయం కాదని, ప్రభుత్వం చాలా కాలంగా అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగా నిలుస్తోందని చెప్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇలాంటి పొదుపు చర్యలు చేపడుతోంది.
ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ప్రజాధనాన్ని ఉపయోగించి గిఫ్టులు ఇవ్వకూడదు. ఈ నిర్ణయం ద్వారా ప్రజాధనం కేవలం ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగపడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ఈ సందేశం కేవలం దీపావళికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని పండుగలు, ప్రత్యేక సందర్భాల్లోనూ వర్తింపజేయాలని పలువురు సూచిస్తున్నారు.
More Stories
దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లలో కస్టమ్స్ దాడులు
మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ రూ.7.44కోట్ల ఆస్తుల జప్తు
2026 నాటికి భారత్ కు ఎస్-400 డెలివరీ పూర్తి