
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై ఊహాజనిత కథనాలు ఆధారంగా పైలట్లను నిందించడం బాధ్యతా రాహిత్యం, దురదృష్టకరమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. విమాన ప్రమాదంపై స్వతంత్ర, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా జూలై 12న విడుదలైన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదికలోని కొన్ని అంశాలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. స్వచ్ఛంద సంస్థ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ ప్రాథమిక నివేదిక విడుదల చేసిందని, ఇందులో పైలట్ల తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ఏఏఐబీ స్పష్టం చేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అయితే, నివేదికలోని పలు అంశాలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానం ఫ్లైట్ డేటా రికార్డర్ నుంచి సమాచారాన్ని విడుదల చేయాలని, ఇది ప్రమాదానికి కారణాన్ని గుర్తించడంలో సహాయపడుతుందని సూచించింది. అయితే, ప్రాథమిక విచారణ ఆధారంగా పైలట్లను నిందించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. పైలట్లలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని సూచించే మీడియా నివేదికలు అత్యంత బాధ్యతారహితమైనవి ధర్మాసనం పేర్కొంది.
నివేదిక ఆధారంగా పైలట్లను నిందిస్తే.. తుది విచారణలో వారి తప్పు లేదని తేలితే ఏం చేస్తారని అంటూ కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై స్వతంత్ర, నిష్పాక్షికమైన, వేగవంతమైన దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు కేంద్రానికి, పౌర విమానయాన డైరెక్టర్ జనరల్‌కు నోటీసు జారీ చేసింది. ఈ అంశం గోప్యత, గౌరవానికి సంబంధించినదని సుప్రీంకోర్టు పేర్కొంది.
ప్రత్యర్థి విమానయాన సంస్థలు కొంత సమాచారాన్ని విడుదల చేయడం వల్ల దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ప్రమాదంపై స్వేచ్ఛగా, న్యాయంగా, నిష్పాక్షికంగా, త్వరితగతిన దర్యాప్తు జరపడం అనే పరిమిత అంశంపై మాత్రమే నోటీసు జారీ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. కాగా ఈ ఏడాది జూన్‌లో అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ అయ్యాక సెకన్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోయినట్లు ఏఏఐబీ నివేదికను సమర్పించింది. ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ మరో పైలట్‌ను ప్రశ్నించాడని రిపోర్ట్‌లో పేర్కొంది. తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. కాక్‌పిట్‌లో అవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. రెండు స్విచ్‌లు ఒక సెకను తేడాతో ఆగినట్లు నివేదికలో పేర్కొంది. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని, ప్రమాదానికి మూల కారణాలు, సిఫార్సులతో తుది నివేదికను విడుదల చేస్తామని తెలిపింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదిక వెల్లడైన తర్వాత అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు దిగ్భ్రాంతిని కలిగించాయి. ఎయిరిండియా విమానం పైలటే ఇంధన స్విచ్‌ను షట్‌డౌన్ చేశారని ఊహాజనిత వార్తలు ప్రచురితమయ్యాయి. దర్యాప్తు కొనసాగుతోన్న దశలో ఇలాంటి చర్యలు బాధ్యతారాహిత్యమని ఏఏఐబీ ఖండించింది.
More Stories
స్వదేశీ ఉత్పత్తులే కొనండి, అమ్మండి, వినియోగించండి
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
నవంబర్ 5 నుంచి 15 వరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు!