
* పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ రెచ్చగొట్టే సంకేతాలు
ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన సూపర్4 సమరంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొంతకాలంగా భారత్ చేతిలో వరుస ఓటములు చవిచూస్తున్న పాకిస్థాన్ ప్రస్తుతం డిప్రెషన్‌లో కూరుకుపోయిన విషయం సూపర్4 మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు గట్టి సమాధానం చెప్పాలని భావించిన పాకిస్థాన్‌కు యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు బ్యాట్‌తో గట్టి సమాధానమే ఇచ్చారు.
పాక్ ఆటగాళ్ల కవ్వింపులకు వీరు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. `మీరు నోరు తెరిస్తే మేం బ్యాట్‌తో బాదుతాం..తీరు మారకపోతే మాటల యుద్ధం కూడా చేస్తాం’ అన్నట్టుగా అభిషేక్, గిల్‌లు ముందుకు సాగారు.
కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల ప్రవర్తనపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. ఆటతో సమాధానం చెప్పలేక మైదానంలో దురుసుగా ప్రవర్తించిన పాక్ క్రికెటర్లపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కరచాలనం వివాదంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మనస్పర్థాలు నెలకొన్నాయి. కరచాలనం ఘటనతో కంగుతిన్న పాక్ ఆటగాళ్లలో అసహనం కట్టలు తెంచుకుంది.
సూపర్4 మ్యాచ్‌లో సీనియర్లు షహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్‌లతో పాటు ఓపెనర్ సాహిబ్‌జాద ఫర్హాన్‌లు హద్దులు దాటి ప్రవర్తించారు. ఫర్హాన్ అయితే ఏకంగా భారత ఆటగాళ్లపై గన్ ఎక్కిపెట్టినట్టు సైగలు చేశాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో.. గ్యాలరీలోని ప్రేక్షకులు కోహ్లీ.. కోహ్లీ అంటూ అరిచారు. ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో జరిగిన సంఘటనను గుర్తు చేసే రీతిలో స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు కేకలు పెట్టారు.
అయితే ఆ సయమంలో హరీస్ రౌఫ్ అర్థం కాని రీతిలో కొన్ని సంకేతాలు ఇచ్చాడు. విమానం కూలుతున్నట్లుగా అతను తన చేతులతో సిగ్నల్స్ ఇచ్చాడు. చేతి వేళ్లతో 6-0 అని చూపించాడు. ఆ తర్వాత విమానం కూలుతున్నట్లు సంకేతం ఇచ్చాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత యుద్ధ విమానాలను కూల్చామన్న సంకేతాన్ని రౌఫ్ ఇచ్చినట్లు కొందరు విమర్శకులు అంటున్నారు.
దీనిపై పెద్ద దుమారమే లేచింది. ఫర్హాన్ తీరుపై భారత్‌తో సహా పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు సయితం విమర్శలు కురిపిస్తున్నారు. క్రికెట్ లో ఇలాంటి చర్యలకు తావులేదనివారు హితవు పలికారు. అఫ్రిది, రవూఫ్‌లు కూడా భారత ఓపెనర్లపైఅనుచితంగా ప్రవర్తించారు. ఈ మ్యాచ్‌లో పాక్ క్రికెటర్ల ప్రవర్తన ఏమాత్రం సమంజసంగా లేదనే విషయం స్పష్టంగాకనిపించింది.
వైరలవుతున్న గంభీర్ ఇన్‌స్ట్రా స్టోరీలు
ఇండోపాక్ జట్ల మధ్య జరిగిన పోరులో పాకిస్థాన్ క్రికెటర్ల అనుచిత ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇక పాక్‌పై టీమిండియా విజయం తర్వాత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్‌గా మారింది. పాకిస్థాన్ ఓపెనర్ ఫర్హాన్ ‘గన్’ షాట్‌కు, బౌలర్ రవూఫ్ ‘వెకిలి’ చేష్టలకే భయపడేదే లేదు అనే అర్థం వచ్చేలా గంభీర్ స్టోరీ షేర్ చేశాడు.
దీనికి అభిషేక్, గిల్‌తో టీమిండియా ఫొటోలను జత చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైర్లకు మాత్రమే కరచాలనం చేయాలని, పాక్ ఆటగాళ్లకు అవసరం లేదనే విషయాన్ని గంభీర్ పోస్ట్ ద్వారా స్పష్టం చేశాడు. గంభీర్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
More Stories
ప్రకృతితో సమతుల్యతతో జీవించడమే ఆయుర్వేదం
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి
ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతి