
హైదరాబాద్ నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు దీపావళి నుంచి పరుగులు తీయనున్నాయి. నాంపల్లి- పుణె, చర్లపల్లి-నాందేడ్ మధ్య ఈ కొత్త రైళ్లు నడుస్తాయి. నాంపల్లి-పుణె మధ్య వందేభారత్ రైలు సర్వీసును తీసుకురావాలని ఇటీవలే ప్రతిపాదన వచ్చింది. దానికి రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో చర్లపల్లి-నాందేడ్ మధ్య కూడా వందేభారత్ రైలును పట్టాలు ఎక్కేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నుంచి ఇప్పటికే 5 వందేభారత్ రైళ్లు నడుస్తుండగా ఇప్పుడు మరో రెండు చేరనుండడంతో ఆ సంఖ్య ఏడుకి చేరుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి 600 కిలోమీటర్లు దూరం ఉన్న ప్రాంతాలకే ఈ రైళ్ల సర్వీసులు కొనసాగుతున్నాయి. కొత్తగా మంజూరైన హైదరాబాద్-నాందేడ్ సర్వీసు మధ్య 281 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇక, నాందేడ్‌లోని వ్యాపారులకు తెలంగాణతో వాణిజ్య సంబంధాలు బాగా ఉంటాయి. అలాగే, హైదరాబాద్-నాందేడ్ మార్గంలో నిజామాబాద్ పట్టణం ఉంటుంది. దీంతో అక్కడి వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి పుణ్యక్షేత్రం బాసరకు ప్రయాణీకుల రాకపోకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
ఇక హైదరాబాద్ – పూణే మధ్య వందేభారత్ కోసం సుదీర్ఘ కాలం గా ప్రతిపాదన పెండింగ్ లో ఉంది. ఈ నగరాల మధ్య 592 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొత్తగా వందేభారత్ కేటాయింపు ద్వారా 8 గంటల్లోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం కలుగుతుంది. చర్లపల్లి నుంచి పెద్ద సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగుతుండటంతో ఇప్పుడు చర్లపల్లి – నాందేడ్ మధ్య వందేభారత్ ఖరారు చేసారు.
హైదరాబాద్ – పూణే మధ్య ప్రస్తుతం 17 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇతర రైళ్లకు పూణే వెళ్లేందుకు 12 గంటల వరకు సమయం పడుతోంది. ఇప్పుడు వందేభారత్ ద్వారా ప్రయాణీకులకు సమయం ఆదా కానుంది. దీపావళి నుంచి ఈ రెండు రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
More Stories
డ్రగ్స్ రహిత సమాజం కోసం బిజెపి 3కె రన్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం