
బగ్రామ్ ఎయిర్‌బేస్ ను తిరిగి ఇవ్వకపోతే అఫ్గాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికను తాలిబన్లు తోసిపుచ్చారు. ఒక్క అంగుళం కూడా ఇవ్వబోమని, దానిపై ఒప్పందం ప్రసక్తేలేదని తాలిబన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆఫ్ఘన్ ప్రభుత్వ రక్షణ అధికారి ఒకరు ఓ ప్రకటన విడుదల చేశారు.
రాజధాని కాబూల్‌కు ఉత్తరాన ఉన్న బాగ్రామ్ ఆఫ్ఘనిస్థాన్‌లో అతిపెద్ద వైమానిక స్థావరం. రెండు దశాబ్దాలు తాలిబన్లతో యుద్ధంలో అమెరికా సైనిక కార్యకలాపాలకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. నాలుగేళ్ల కిందట అమెరికా సేనలు అఫ్గన్ నుంచి వైదొలగాయి. మళ్లీ ఈ స్థావరాన్ని తిరిగి ఇవ్వకపోతే అఫ్గన్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదనిహెచ్చరిస్తూ ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఒక పోస్టు పెట్టారు.
అఫ్గానిస్థాన్‌లోని బగ్రామ్ ఎయిర్‌బేస్‌ను దాన్ని నిర్మించిన వారికి అంటే అమెరికాకు తిరిగి ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. అలా చేయకపోతే తాను తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ బెదిరింపులపై తాలిబన్ల రక్షణ శాఖ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫాసిహుద్దీన్ ఫిత్రాత్ స్పందించారు. “బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకోడానికి ఇటీవల కొంత మంది అఫ్గనితో చర్చలకు ప్రయత్నించారు. మా భూభాగంలోని ఒక్క అంగుళంపై కూడా ఒప్పందం సాధ్యం కాదు. మాకు ఎలాంటి ఒప్పందం అవసరం లేదు” అని తెగేసి చెప్పారు. ‘అఫ్గన్ ప్రాంతీయ సమగ్రత, స్వతంత్రతకు మాకు ఎంతో ముఖ్యం’ అని స్పష్టం చేసింది.
ఇదే విషయంపై ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ బగ్రామ్ ఎయిర్‌బేస్ స్వాధీనం చేసుకునే అంశంపై అఫ్గాన్‌తో చర్చలు జరుపుతామని చెప్పారు. దాన్ని తిరిగి తీసుకుంటామని, వారు ఇవ్వకపోతే తాను ఏం చేస్తానో ఎవరూ ఊహించలేరని పేర్కొన్నారు. చైనా అణు క్షిపణులు తయారు చేసే ప్రదేశానికి సమీపంలో ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన బగ్రామ్ ఎయిర్ బేస్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు.
చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాలకు ఇది అతి దగ్గరగా ఉంటుందని, కేవలం గంట వ్యవధిలో వెళ్లొచ్చని తెలిపారు. అయితే, 2020లో ట్రంప్ అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే తాలిబన్లతో కుదిరిన ఒప్పందంలో భాగంగానే 2021లో ఈ స్థావరం నుండి అమెరికా సేనలు వైదొలిగాయి. ట్రంప్ హెచ్చరికపై చైనా స్పందిస్తూ అఫ్గాన్ భవిష్యత్తు అక్కడి ప్రజల చేతుల్లోనే ఉందని పేర్కొంది. ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడంవల్ల మద్దతు లభించదని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ పరోక్షంగా ట్రంప్ ను హెచ్చరించారు. కాగా ఎయిర్‌బేస్‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేమని అఫ్గాన్ అధికారులు ఇప్పటికే స్పష్టంచేశారు.
More Stories
భారత్ చేతిలో మరోసారి చిత్తుగా ఓడిన పాక్
పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము