ఆపరేషన్‌ సిందూర్‌ మళ్ళీ మొదలు కావచ్చు

ఆపరేషన్‌ సిందూర్‌ మళ్ళీ మొదలు కావచ్చు
ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని, కేవలం తాత్కాలికంగానే నిలిపివేశామని చెబుతూ పాక్‌ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే ఆ దేశానికి తగిన విధంగా బదులిస్తామని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ హెచ్చరించారు. మొరాకో పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తూ సిందూర్‌ పార్ట్‌ 2,3 అనేది పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుందని దాయాదిని హెచ్చరించారు.
 
గ్రవాదులకు మద్దతిస్తోన్న పాకిస్థాన్‌కు సరిహద్దుల్లోనే కాకుండా, వారి సొంతగడ్డపైనా గట్టిగా బుద్ధి చెప్పామని రక్షణ మంత్రి గుర్తు చేశారు. కేవలం సరిహద్దుల్లోనే కాదు భూభాగంలో 100 కిలోమీటర్లు లోపలికి వెళ్లి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసినట్లు రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆ దాడుల్లో మసూద్‌ అజార్‌ కుటుంబం చెల్లాచెదురైందని తెలిపారు.  ఆ విషయాన్ని తాజాగా.. జైషే ఉగ్ర నాయకులే అంగీకరించినట్లు చెప్పారు.
పాకిస్థాన్‌ వేడుకోవడం వల్లే కాల్పుల విరమణకు అంగీకరించామని పేర్కొంటూ స్నేహితులు మారొచ్చు గానీ పొరుగువారు ఎప్పటికీ మారరు అని వాజ్‌పేయీ చెబుతుండేవారని గుర్తు చేశారు. అందుకే వారిని సరైన మార్గంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు.  ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ప్రకటించారు. అది ఎప్పుడైనా మళ్లీ మొదలవ్వొచ్చు అని స్పష్టం చేశారు. సిందూర్‌ పార్ట్‌ 2, పార్ట్‌ 3 అనేది పాక్‌ చర్యలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
పాక్ మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే తగినవిధంగా బుద్ధి చెప్పడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు. పాక్​ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) గురించి ప్రస్తావిస్తూ అక్కడ డిమాండ్లు మొదలయ్యాయని, నినాదాలు మీరు కూడా వినే ఉంటారని పేర్కొన్నారు. పీఓకేపై దాడి చేసి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని ఐదు సంవత్సరాల క్రితం కశ్మీర్​లో సైన్యాన్ని ఉద్దేశించి ప్రసగించిన్పపుడు చెప్పానని గుర్తు చేశారు. ఇది ఎలాగైనా మనదే అవుతుందని, ఆ రోజు వస్తుందని తెలిపారు.