
అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మ, మూలపుటమ్మ, కనక దుర్గమ్మ కొలువైన పవిత్ర క్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరణ నవరాత్రులు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున దుర్గమ్మ బాల త్రిపుర సుందరి రూపంలో దర్శనం ఇచ్చి భక్తులను ఆశీర్వదించింది.శారదా నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గలుగా ఆరాధించే రెండు సంప్రదాయాలు ఉన్నాయి.
మొదటి సంప్రదాయం పురాణోక్తం. ఈ ప్రకారం మొదటి రోజున అమ్మవారిని బాల త్రిపుర సుందరిగా భావించి పూజిస్తారు. త్రిపుర సుందరి అంటే ఈశ్వరుని భార్య గౌరీ దేవి. ఈ దేవి మనలోని మూడు అవస్థలు అయిన జాగృతి, స్వప్న, సుషుప్తి, అలాగే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని నియంత్రిస్తుందని నమ్మకం.
అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీషా, ఈవో సీనా నాయక్, స్పెషల్ ఆఫీసర్ భ్రమరాంబ తొలి దర్శనం చేసుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం పది అవతారాల్లో దర్శనం ఇచ్చిన దుర్గమ్మ ఈ సంవత్సరం 11వ ప్రత్యేక అవతారం కాత్యాయనీ దేవిగా యాత్రికులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈనెల 29 మూలా నక్షత్రం రోజున అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ రోజు అన్ని ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేశారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్గమ్మకు పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సంబరాలకు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. విఐపి, వివిఐపి యాత్రికులకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శన సమయం కేటాయిస్తామని తెలిపారు.
ఈ దసరా ఉత్సవాలకు రూ.500 టికెట్స్ రద్దు చేశారు. కేవలం రూ.300, రూ.100 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని వివరించారు. యాత్రికులకు అన్నదానం, ప్రసాదం పంపిణీ కూడా నిత్యం జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణులకు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశామన్నారు. క్లూ లైన్లో వాటర్ బాటిళ్లు, బిస్కెట్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు.
5 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్ నిర్వహించనున్నారు. 500 సిసి కెమెరాలు, 25 డ్రోన్లతో దసరా ఉత్సవాలను పర్యవేక్షించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు 12 చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు.
More Stories
జీఎస్టీ సంస్కరణలకు ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు
సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు