మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం

మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
సారధ్యంలో ఓ బిజెపి బృందం మాజీ డీఎస్పీ నళినిని భువనగిరిలో ఆమె స్వగృహానికి వెళ్లి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితి, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ, బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బూర నర్సయ్య గౌడ్, సీనియర్ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు.
 
నళిని తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీస్ శాఖలో ఉన్నప్పటికీ జై తెలంగాణ నినాదంతో ఉద్యమానికి మద్దతు ఇచ్చి రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. రాజీనామా తర్వాత ఆమెను సస్పెండ్ చేశారని, ఇప్పటివరకు ఆమెకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.  గత బీఆర్ఎస్ తో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆమెను  ఇబ్బందులకు గురిచేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ ఆమెకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు ఇప్పటివరకు కల్పించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.  నళిని 16 పేజీలలో నివేదిక సమర్పించి పరిస్థితులను వివరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇతర కారణాలు చెబుతూ ప్రయోజనాలు విడుదల చేయక పోవడంతో ఆమె మానసిక వేదనకు గురయ్యారని, దానితో ఆమె ఆరోగ్యం క్షీణించిందని రామచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకు మద్దతుగా నిలుస్తూ, బిజెపి బృందం ఆమెను పరామర్శించిన్నట్లు తెలిపారు.  తన ఉద్యోగ విరమణ వేతనం, ఇతర అధికారిక ప్రయోజనాలను సమాజ సేవ కోసం వినియోగిస్తానని నళిని ప్రకటించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆమెకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలను విడుదల చేసి, ఆమెను మానసిక వేదన నుండి బయటకు తీసుకు రావాలని బిజెపి నేత డిమాండ్ చేశారు. 
ఒకవేళ ఆమె ప్రధాని నరేంద్ర మోదీని కలవాలి అనుకొంటే, ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం కలిసేలా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.  ఇలా ఉండగా, తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో రాజీనామా చేసిన డీఎస్పీ న‌ళిని రెండు రోజుల క్రితమే ఓ బ‌హిరంగ లేఖలో `ఇది నా మ‌ర‌ణ వాంగ్మూలం ‘ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేయడం కలకలం రేపింది. 
త‌న ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని, త్వ‌ర‌లోనే త‌న జీవితం ముగియ‌బోతుంద‌ని ఆమె ఆ లేఖ‌లో పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రికి పెట్టిన ద‌ర‌ఖాస్తు బుట్ట‌దాఖ‌లైందని పేర్కొంటూ తాను చ‌నిపోయాక రాజ‌కీయ ల‌బ్ధి కోసం త‌న పేరును వాడుకోవ‌ద్దు అని ఆమె సూచించారు. వ‌చ్చే జ‌న్మ‌లో మోక్ష సాధ‌న కోసం ప్ర‌య‌త్నిస్తాను అని న‌ళిని తెలిపారు. 

“ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్‌గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నాను. 3 రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను” అని ఆమె పేర్కొన్నారు.