నవంబర్‌ 5 నుంచి 15 వరకు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు!

నవంబర్‌ 5 నుంచి 15 వరకు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు!
బీహార్ ​ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్​ శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. నవంబర్​ 22వ తేదీతో బిహార్​ అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ లోపే ఎన్నిక జరిగేలా సన్నదమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఛట్​పూజ వేడుకల అనంతరం పోలింగ్​ నిర్వహించవచ్చని తెలుస్తున్నది.  ఈ ఎన్నికలు మూడు విడతల్లో నవంబర్ 5 నుంచి 15 వరకు జరగవచ్చని తెలుస్తోంది.
అసెంబ్లీ గడువు ముగిసేలోపే కొత్త సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. 2020లో కూడా మూడు విడతల్లోనే పోలింగ్​ నిర్వహించారు. 71 సీట్లకు అక్టోబర్​ 28న, 94 స్థానాలకు నవంబర్​ 3న, 78 నియోజక వర్గాల్లో నవంబర్ 7న పోలింగ్​ నిర్వహించారు. 2015లో మాత్రం ఐదు విడతల్లో పోలింగ్​ ప్రక్రియ నిర్వహించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ కార్యకలాపాలు శరవేంగా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల సన్నాహాలను ఖరారు చేయడానికి ఈసీ ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్​ కుమార్ సెప్టెంబర్ 30 తర్వాత బిహార్​లో పర్యటించే అవకాశం ఉంది.ఎన్నికల సన్నాహాలను సంబంధించి అన్ని ఏర్పాట్లను పరిశీలించనున్నారు. పర్యటన అనంతరం ఈసీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు, బిహార్​ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలను ముమ్మరం చేశాయి. ఈ ఏడాది 243 అసెంబ్లీ స్థానాలకు గానూ ఓటింగ్ జరగనుంది.
దీంతో ప్రస్తుతం బిహార్​ రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష మహాకూటమ రెండూ తమ సొంత విజయ వ్యూహాన్ని రూపొందించడంలో సన్నాహాలు మొదలుపెట్టాయి. దీంతో ఈసారి బిహార్​లో ఎన్నికల పోటీ చాలా ఆసక్తికరంగా మారనున్నాయి. ఇదిలా ఉండగా బిహార్​ ఎలక్షన్లలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) బ్యాలెట్‌ పేపర్లపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్‌ ఫొటోలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈవీఎం బ్యాలెట్‌ పేపర్ల రూపకల్పన, ముద్రణ మార్గదర్శకాలను బుధవారం ఈసీ సవరించింది.  దీంతో ఇక నుంచి కొత్త బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల కలర్ ఫొటోలు దర్శనమివ్వనున్నాయి. ఓటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు కేటాయించిన స్థలంలో మూడొంతుల వరకు అభ్యర్థి ముఖాన్ని ముద్రించనున్నట్లు ఎన్నికల కమిషన్​ తెలిపింది.
ఎన్నికల ప్రక్రియలో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా గత ఆరు నెలల కాలంలో తీసుకువచ్చిన 28 మార్పుల్లో తాజా నిర్ణయం కూడా భాగమని ఈసీ వెల్లడించింది. అలాగే అభ్యర్థుల సీరియల్ నంబర్లను 30 ఫాంట్‌ సైజ్‌తో బోల్డ్‌లో ముద్రించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థుల పేర్లు, నోటా ఆప్షన్‌ను కూడా అదే నిబంధన వర్తించనున్నట్లు తెలుస్తోంది. అయితే బిహార్‌లో ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈసీ ​(ఎస్​ఐఆర్)ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్వహించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్​ తీవ్ర విమర్శలు చేసింది. దీనిపై అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అనే స్వచ్ఛందసంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ ఈసీ చర్యను ధర్మాసనం సమర్థించింది. రాజ్యాంగం ప్రకారమే ఇది జరుగుతుందని పేర్కొంది. సుమారు 65 లక్ష మందికిపైగా ఓటర్లను జాబితా నుంచి తొలగించింది. సెప్టెంబ‌ర్ 30న ఓట‌ర్ల తుది జాబితా ప్రక‌టించ‌నుంది. అయితే ఈసీ చర్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తుది జాబితా చట్టవ్యతిరేకంగా ఉన్నట్లయితే మొత్తం ఓటరు లిస్టును రద్దు చేస్తామని స్పష్టం చేసింది.