ఆప‌రేష‌న్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్‌

ఆప‌రేష‌న్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్‌
పాకిస్థాన్ ప్రేరేపిత జేషై మ‌హ‌మ్మ‌ద్‌, హిజ్‌బుల్ ముజాహిద్దిన్ ఉగ్ర సంస్థలు త‌మ స్థావ‌రాల‌ను మార్చుకుంటున్నాయి. ఇన్నాళ్లూ పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో ఉన్న ఆ సంస్థ‌లు ఇప్ప‌డు త‌మ శాశ్వత స్థావరాలను ఖైబ‌ర్ ఫ‌క్తున్‌క్వాకు మార్చుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఆప‌రేష‌న్ సింధూర్ అనంత‌రం ఈ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయ‌ని భార‌తీయ ర‌క్ష‌ణ శాఖ, నిఘా వ‌ర్గాలు అనుమానిస్తున్నాయి. 
 
చాలా వ్య‌వూహాత్మ‌క రీతిలో ఈ ఉగ్ర సంస్థ‌లు త‌మ స్థావ‌రాల‌ను మార్చుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. భార‌తీయ దాడుల‌కు పీవోకే అనువుగా ఉండ‌డంతో ఆ సంస్థ‌లు త‌మ స్థావ‌రాల‌ను మ‌రో చోటుకు మారుస్తున్నాయి. ఖైబ‌ర్ ఫ‌క్తున‌క్వా ప్రాంతం ఆఫ్ఘ‌న్ బోర్డ‌ర్ స‌మీపంలో ఉన్న నేప‌థ్యంలో ఆ ప్రాంతాన్ని సుర‌క్షితంగా ఆ సంస్థ‌లు భావిస్తున్నాయి. ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో బ‌హ‌వ‌ల్‌పుర్‌, ముర్దికి, ముజాఫ‌రాబాద్ ప‌ట్ట‌ణాల్లో ఉన్న ఉగ్ర‌వాద కేంద్రాల‌ను భార‌తీయ సైన్యం ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే.
అయితే ప్ర‌స్తుతం ఉగ్ర సంస్థ‌లు మ‌కాం మారుస్తున్న విష‌యం ప్ర‌భుత్వ అధికారులకు తెలుసని కొన్ని వ‌ర్గాలు చెబుతున్నాయి. ఉగ్ర స్థావ‌రాల త‌ర‌లింపులో ప్ర‌భుత్వం స‌హ‌కరిస్తున్న‌ట్లు కూడా ఇంటెలిజెన్స్ ద్వారా స్ప‌ష్టం అవుతోంది. పోలీసుల ర‌క్ష‌ణ‌లో జైషే సంస్థ త‌మ కార్య‌క‌లాపాలు సాగిస్తున్న‌ట్లు కొన్ని నివేదిక‌లు చెబుతున్నాయి. కేపీకేలోని మ‌న్‌సెహ‌రా జిల్లాలో ఉన్న గ‌రి హ‌బీబుల్లా ప‌ట్ట‌ణంలో జైషే మ‌హమ్మ‌ద్ సంస్థ ప‌బ్లిక్ రిక్రూట్మెంట్ తిరిగి ప్రారంభించింది. 

సెప్టెంబ‌ర్ 14వ తేదీన ఇండోపాక్ మ్యాచ్‌కు కొన్ని గంట‌ల ముందే ఈ ప్ర‌క్రియ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.  భారతదేశం గాలిస్తున్న  మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్‌ , జెఎం వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్‌తో దగ్గరి సంబంధం ఉన్న జెఎం సీనియర్ నాయకుడు ములానా ముఫ్తీ మసూద్ ఇలియాస్ ఈ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడాడు.  సాయుధ ఉగ్రవాదులు,  స్థానిక పోలీసుల కాపలాలో ఈ ర్యాలీ జరగడం గమనిస్తే వారికి  పాకిస్తాన్ ప్రభుత్వం యంత్రాంగం నుండి నిశ్శబ్ద మద్దతును స్పష్టం అవుతుంది.