‘మోహన్‌లాల్‌’కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

‘మోహన్‌లాల్‌’కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు
భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్’ను 2023వ సంవత్సరానికి గాను మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ (65)కు ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వం శనివారం ప్రకటించింది. భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారికంగా వెల్లడించింది.  మలయాళ సినిమా మాత్రమే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో తన ప్రభావాన్ని చూపిన మోహన్‌లాల్‌కు ఈ అవార్డు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌గా అందించబోతున్నారు. 
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా భారతీయ సినిమా ఉన్నతికి మోహన్లాల్ చేసిన అద్భుతమైన కృషికిగాను దాదా సాహెబ్ అవార్డుకు ఎంపిక అయ్యారు” అని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.  “మోహన్లాల్ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. ఆయన అసమాన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, అవిశ్రాంత కృషి భారతీయ చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఒక బంగారు ప్రమాణాన్ని (గోల్డెన్ స్టాండర్డ్) నెలకొల్పాయి” అని వివరించింది.  
ఈ అవార్డును భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో సెప్టెంబర్ 23న విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో అందజేస్తారు.  అవార్డులో స్వర్ణ కమలం (గోల్డెన్ లోటస్) మెడల్, షాల్, రూ.10 లక్షల నగదు బహుమతి ఉంటాయి.  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన మోహన్లాల్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మలయాళ సినిమాకు మోహన్లాల్ ఒక జ్యోతి వంటి వారని ప్రశంసించారు.

“మోహన్లాల్ సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాను. మోహన్లాల్ ప్రముఖ ప్రజ్ఞాశాలి. దశాబ్దాలుగా చేసిన గొప్ప కృషితో ఆయన మలయాళ సినిమా, నాటక రంగానికి ఒక వెలుగులా నిలుస్తున్నారు. కేరళ సంస్కృతి పట్ల ఆయన చాల మక్కువతో ఉంటారు,” అని ప్రధాని కొనియాడారు.  మోహన్‌లాల్‌ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన నేపథ్యంలో మరో మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

“దశాబ్దాలుగా ఈ అద్భుతమైన సినిమా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మోహన్లాల్ ఒక గొప్ప సోదరుడు, కళాకారుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది కేవలం ఒక నటుడికి ఇవ్వలేదు. సినిమాలో జీవించి, దానిని శ్వాసించిన నిజమైన కళాకారుడికి ఇచ్చారు. లాల్, మీకు అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మీరు నిజంగా ఈ అవార్డుకు అర్హులు” అని తెలిపారు.
‘లలేట్టన్’ అని మలయాళి ప్రేక్షకులు అభిమానంతో పిలుస్తున్న మోహన్‌లాల్ 1970ల నుంచి 500కు పైగా సినిమాల్లో నటించి, దర్శకత్వం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ పనిచేశారు.  మలయాళ సూపర్స్టార్ అయిన మోహన్లాల్ చిత్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన, విమర్శకుల ప్రశంసలు పొందిన ఎన్నో చిత్రాలు ఉన్నాయి. వాటిలో తన్మాత్ర, దృశ్యం, వానప్రస్థం, ముంథిరివల్లికల్ తలిర్కుకుంబోల్, పులిమురుగన్ మొదలైనవి ఉన్నాయి.

‘మనరత్నం’, ‘ద్రువపద్మం’, ‘వన్‌స్ ఫుల్ రెడ్ ఈవెనింగ్’ వంటి భారతీయ సినిమాకు గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో తన పాత్రలతో ప్రశంసలు అందుకున్నారు. రెండు సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు పొందారు. జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డులు నాలుగు సార్లు తీసుకున్నారు. 

అలాగే తొమ్మిది కేరళ రాష్ట్ర అవార్డులు సహా అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నో పొందారు. ‘వానప్రస్థానం’ చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాతగా మరో అవార్డు వచ్చింది. ఇక ఫిలింఫేర్ అవార్డులు కూడా ఆయనను వరించాయి. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి గౌరవాలు ఇప్పటికే పొందిన మోహన్‌లాల్, ఈ అవార్డుతో తన ప్రస్థానాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు.