తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం

తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత నెలకొన్నదని, దానిని భర్తీ చేసుకుంటూ అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పని తీరు చూసి విసిగిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు చూస్తున్నారని చెప్పారు.  సిఎం రేవంత్‌రెడ్డికి కేద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, బిజెపి ఫొబియా పట్టుకున్నదని రాంచందర్ రావు విమర్శించారు.
పొద్దున లేచినప్పటి నుంచి బిజెపి లేదా కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఎంత ఫొబియా పట్టుకున్నదో అర్థమవుతున్నదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమాగా చెప్పారు.  అభ్యర్థిని ఖరారు చేసేందుకు పార్టీ తరపున కమిటీని ఏర్పాటు  చేస్తామని, పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహపడుతున్నారని, ఇప్పటికే చాలా దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.
ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడు కేంద్రం సహకరించడం లేదంటూ విమర్శిస్తూ, బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నదని ఆయన రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రూపు-1 పరీక్ష నిర్వహించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరీక్ష నిర్వహించలేక చతికిలపడిందని ఆయన దుయ్యబట్టారు. 
రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని, ఆరోగ్య శ్రీ నడపడానికి డబ్బులు లేకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా వర్సిటీకి వెళ్ళి వెయ్యి కోట్లు ఇస్తానని ప్రకటించారని రాంచందర్ రావు విమర్శించారు.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం కూలిన పిల్లర్లపై కోరడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
సిబిఐ విచారణపై విశ్వాసం ఉందని పేర్కొంటూ కాళేశ్శరం ఏటిఎంలా మారిందని కేంద్ర మంత్రి అమీత్ షా కూడా అన్నారని ఆయన గుర్తు చేశారు. నక్సల్స్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నక్సల్స్ ప్రతినిధులతో జానారెడ్డి కమిటీ జరిపిన చర్చలు ఏమయ్యాయని రాంచందర్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో కుంటుపడుతూ అవినీతిలో పెరుగుతున్నదని ఆయన విమర్శించారు.

రాహుల్ గాంధీ వేసిన హైడ్రోజన్ బాంబ్ తుస్సుమన్నదని ఎద్దేవా చేశారు.  ఓట్ చోరీ నినాదమే తప్పంటూ నకిలీ ఓట్ల ఏరి వేత, ఒకే ఇంట్లో వంద ఓట్లు ఉంటే పరిశీలించడం, కొంత మందికి రెండు చోట్ల ఓట్లు ఉండడం, మరణించిన వారి ఓట్లు కొనసాగడం వంటి వాటిని ఎన్నికల కమిషన్ పరిశీలన చేసి వాటిని సరి చేయాలని, సంస్కరణలు తేవాలని రాంచందర్ రావు సూచించారు.