టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు

టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
వైసిపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు బి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్‌ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. వీరికి టిడిపి కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు ఈ రాజీనామాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అయినప్పటికీ, రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా టీడీపీలో చేరిన ఈ ముగ్గురి నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. మండలిలో తమ రాజీనామాలను ఛైర్మన్‌ ఆమోదించడం లేదని వారు విమర్శించారు. రాజీనామాల ఆమోదం కోసం ఆరు నెలలుగా వేచి చూశామని, దానితో రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం కలగడం లేదని తెలిపారు. మండలి ఛైర్మన్‌ వెనుక వైసిపి పెద్దలు కొంతమంది తమ రాజీనామాలను ఆమోదించకుండా అడ్డుకుంటున్నారని మర్రి రాజశేఖర్‌ దుయ్యబట్టారు. 
సోమవారం నుంచి మండలికి వెళ్తామని, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.   స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలోనూ ఈ మార్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని  భావిస్తున్నారు.
 
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు సునీల్‌, విజయశ్రీ, పులివర్తి నాని, ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, పేరాబత్తుల రాజశేఖర్‌, రామ్‌గోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్‌, బిటి నాయుడు, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ, ఫారెస్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుజయకృష్ణ రంగారావు తదితరులు పాల్గొన్నారు.