హెచ్‌-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్‌ సంస్థలు అప్రమత్తం

హెచ్‌-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్‌ సంస్థలు అప్రమత్తం

* 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి రావాలని ఉద్యోగులకు ఆదేశాలు!

హెచ్​-1బీ వీసాదారుల వార్షిక రుసుమును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం టెక్‌ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండడంతో టెక్‌ సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న హెచ్​-1బీ వీసాదారులు 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి రావాలని టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్‌, మెటా వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగాలకు ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది.

ఇతర దేశాల్లో ఉన్న హెచ్​-1బీ, హెచ్​-4 వీసాదారులు సెప్టెంబరు 21లోపు అమెరికాకు తిరిగిరావాలని కోరుతూ మైక్రోసాఫ్ట్‌ తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్​ తమ ఉద్యోగులకు ఒక అంతర్గత ఈమెయిల్‌ పంపించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.  అయితే అమెరికాలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు మంచి భవిష్యత్తు కోసం అక్కడే పనిని కొనసాగించాలని మైక్రోసాఫ్ట్‌ సూచించినట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై మైక్రోసాఫ్ట్‌ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరో దిగ్గజ సంస్థ మెటా కూడా తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.  పని లేదా వెకేషన్‌ కోసం ఇతర దేశాలకు వెళ్లిన హెచ్​-1బీ వీసా కలిగి ఉన్న తమ ఉద్యోగులు 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి వచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అమెరికాలో ఉంటోన్న హెచ్​-1బీ, హెచ్​-4 ఉద్యోగులు రెండు వారాల పాటు ఇతర దేశాలకు వెళ్లొద్దని సూచించింది. వారంతా అమెరికాలోనే ఉండాలని తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది.

మరోవైపు ఇప్పటికే హెచ్​-1బీ వీసాలు ఉన్నవారు 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి వచ్చేయాలని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు చెబుతున్నారు. ఒక వేళ వారు గడువులోగా రాకుంటే, అమెరికాలోకి ప్రవేశం నిరాకరించబడే ప్రమాదం ఉందని అంటున్నారు.

“ప్రస్తుత పరిస్థితుల్లో భారత్​లో ఉన్న హెచ్​-1బీ వీసాదారులు 24 గంటల్లో అమెరికా చేరుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం భారత్​ నుంచి అమెరికాకు డైరెక్ట్ విమానాలు ఏవీ లేవు. కనుక వారు అమెరికాలోకి ప్రవేశించే అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని” న్యూయార్క్​లోని ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది సైరస్ మెహతా ఎక్స్​లో ఓ పోస్ట్ పెట్టారు. 

అయితే డైరెక్ట్ ఫ్లైట్ లేకపోయినప్పటికీ, భారత్​లో ఉన్న హెచ్​-1బీ వీసాదారులు ఇతర మార్గాల్లో 24 గంటల్లోనే కాలిఫోర్నియాకు చేరుకునే అవకాశం ఉంది అని మెహతా పేర్కొన్నారు.