తన బెయిల్ షరతులను మార్చాలంటూ కవి, ఉద్యమకారుడు పీ వరవరరావు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. మహారాష్ట్రలో 2018లో జరిగిన భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో అరెస్టయిన ఆయనకు అనారోగ్య కారణాల దృష్ట్యా గతంలో షరతులతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గ్రేటర్ ముంబయి దాటి బయిటకు వెళ్లాలంటే ముందుగా ట్రయల్ కోర్టు అనుమతి తీసుకోవాలన్నది అందులో ఒకటి. ఈ నిబంధనను సడలించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
పరిశీలించిన జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ల ధర్మాసనం దీనిని స్వీకరించడానికి ఇష్టం చూపించలేదు. వరవరరావు తరఫున సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపిస్తూ 85 ఏళ్ల వయసు కావడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. గతంలో ఆయన బాగోగులను భార్య చూసేవారని, ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నారని చెప్పారు. ఆయనను చూసేవారు ఎవరూ లేరని తెలిపారు.
కేసు విచారణ ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదని అందువల్ల ఆయన ముంబై దాటి వెళ్లేందుకు అవకాశం కలిగించాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘ముంబయిలోనే వైద్యం అందుతుంది. ఆయన ఆరోగ్యంపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. కావాలనుకుంటే ముంబయిలోని ట్రయల్ కోర్టుకే వెళ్లండి. మాకు ఆసక్తి లేదు’’ అని పేర్కొంది. హైదరాబాద్‌కు ఆయనను తరలించేందుకు తగిన కారణాలు కనిపించడం లేదని అభిప్రాయపడింది. షరతుల్లో మార్పులు చేయడంపై విచారణ జరపలేమని తెలిపింది.
More Stories
విదేశీ నిధులకోసం క్రైస్తవ సంస్థలో `జోగినులు’గా విద్యార్థినులు
జిహెచ్ఎంసీ పరిధి విస్తరించడం ఎంఐఎం కోసమే!
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్