చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు

చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
 
భారతదేశానికి స్వావలంబనగా మారడం తప్ప భారతదేశానికి వేరే మార్గం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. “భారతదేశానికి స్వావలంబనగా మారడం తప్ప వేరే మార్గం లేదు. ఇది చిప్స్ లేదా ఓడలు అయినా, మనం వాటిని భారతదేశంలో తయారు చేయాలి” అని పిలుపిచ్చారు.  గుజరాత్ లోని భావ్‌ నగర్‌ లో రూ.34,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ వాణిజ్యాన్ని సరళీకృతం చేయడానికి, మరింత సమర్థవంతంగా చేయడానికి ‘వన్ నేషన్, వన్ డాక్యుమెంట్’, ‘వన్ నేషన్, వన్ పోర్ట్ ప్రాసెస్’ వంటి కార్యక్రమాలతో సహా భారతీయ ఓడరేవులకు రాబోయే సంస్కరణలను ఆయన ప్రకటించారు.
 
ఈ దశలు దాని సముద్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి,దేశవ్యాప్తంగా వ్యాపారం చేసే సౌలభ్యాన్ని పెంచడానికి భారతదేశపు విస్తృత దృష్టిలో భాగం అని చెప్పారు. భారత్​కు ప్రధాన శత్రువు ఇతర దేశాలపై ఆధారపడటమేనని చెబుతూ దేశంలోని అన్ని సమస్యలకు ఒకే ఒక ఔషధం ఉందని, అదే ఆత్మనిర్భర్ భారత్ అని తెలిపారు.  లైసెన్స్ రాజ్ వంటి ఆంక్షలు విధించడం ద్వారా కాంగ్రెస్ భారతీయుల వారసత్వ ప్రతిభను అణచివేసిందని ప్రధాని విమర్శించారు.
ప్రపంచవ్యాప్తంగా వస్తువులను రవాణా చేయడానికి భారత్ విదేశీ సంస్థలకు ఏటా రూ. 6 లక్షల కోట్లు చెల్లిస్తోందని, ఇది దాదాపు భారత దేశ రక్షణ బడ్జెట్​కు సమానమని చెప్పారు. (సెమీ కండక్టర్) చిప్​లు లేదా నౌకలను భారత్​లోనే తయారు చేయాలని మోదీ పేర్కొన్నారు. పెద్ద నౌకలను మౌలిక సదుపాయాలుగా గుర్తించడం ద్వారా భారత సముద్ర రంగాన్ని బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
ప్రపంచ సముద్ర శక్తి కేంద్రంగా భారత్ ఎదగడానికి దేశంలోని ఓడరేవులు వెన్నెముకగా నిలిచాయని ప్రధాని కొనియాడారు. “నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో భారత్ కు పెద్ద శత్రువులెవరూ లేరు. దేశానికి ఏకైక శత్రువు ఇతర దేశాలపై ఆధారపడటమే. ఇతర దేశాలపై ఆధారపడడాన్ని భారత్ తగ్గించాలి. మనం ఇతరులపై ఎంత ఎక్కువగా ఆధారపడతామో, వైఫల్య రేటు అంత ఎక్కువగా ఉంటుంది” అని ప్రధాని తెలిపారు. 

“మనం ఇతరులపై ఆధారపడితే ఆత్మగౌరవం దెబ్బతింటుంది. 140 కోట్ల ప్రజల భవిష్యత్తును ఇతరులకు అప్పగించలేం. రాబోయే తరాల భవిష్యత్తును ఫణంగా పెట్టలేం. చిప్స్ నుంచి ఓడల వరకు మనం ప్రతిదీ తయారు చేయాలి. శాంతి, స్థిరత్వం, సంపద కోసం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం (భారత్​ను ఉద్దేశించి) స్వావలంబన పొందాలి” అని మోదీ తెలిపారు. అలాగే కాంగ్రెస్ ఆర్థిక విధానాలను సైతం ప్రధాని మోదీ ఎండగడుతూ హస్తం పార్టీ భారతదేశ సామర్థ్యాన్ని విస్మరించిందని ధ్వజమెత్తారు.

భారత్ కు ఎటువంటి సామర్థ్యాల కొరత లేదని, కానీ స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ దేశ సామర్థ్యాన్ని తుంగలో తొక్కిందని ప్రధాని ఆరోపించారు.  “స్వాతంత్ర్యం వచ్చి 6-7 దశాబ్దాలు గడిచినా, భారత్ ఇంకా అనుకున్న విజయాలు సాధించలేదు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. చాలా కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో లైసెన్స్ రాజ్‌ వంటి ఆంక్షలు విధించింది. దీంతో ప్రపంచ మార్కెట్ నుంచి భారత్ వేరు పడింది” ని చెప్పారు. 

భారతదేశ బలాన్ని బహిర్గతం చేయకుండా కాంగ్రెస్ నిరోధించిందని ఆరోపించారు. యూపీఏ హయాంలో రూ. కోట్ల విలువైన కుంభకోణాలు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు దేశ యువతకు తీవ్ర హాని కలిగించాయని మోదీ ధ్వజమెత్తారు.