వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!

వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!

రుతుపవనాల కాలం వచ్చిందంటే చాలు గంటల వ్యవధిలోనే కుండపోతగా వర్షం కురవడం, ఊళ్లకు ఊళ్లు మునిగిపోవడం సాధారణంగా మారింది. ఇది ఈ ఒక్క ఏడాది సమస్య కాదని, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇకపై ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో గత రెండేళ్లుగా వర్షపాతం రికార్డులు బద్దలవుతున్నాయి.
2023 జులైలో ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఒకేరోజు 64 సెం.మీ. వర్షం కురవగా, ఇటీవల కామారెడ్డి జిల్లాలో 55 సెం.మీ. వర్షపాతం నమోదైంది. గత నెల నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 10 నుంచి 20 సెం.మీ. వర్షం కొన్ని గంటల్లోనే కురుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గంటలో 10 సెం.మీ. కంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని ‘క్లౌడ్ బరస్ట్’గా పిలుస్తారని, గత పదేళ్లుగా మన దేశంలో ఇలాంటి ఘటనలు గణనీయంగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.
భూతాపం పెరగడం వల్లే ఈ విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.  సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడంతో నీరు ఎక్కువగా ఆవిరవుతోంది. అదే సమయంలో వేడెక్కిన గాలి, ఈ నీటి ఆవిరిని (తేమను) ఎక్కువ మోతాదులో నిల్వ ఉంచుకుంటోంది. ఈ అధిక తేమతో కూడిన గాలులే దట్టమైన మేఘాలుగా ఏర్పడి, ఒక్కసారిగా కుండపోత వర్షాలకు కారణమవుతున్నాయి.

ఈ మార్పు కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా సహారా, సౌదీ అరేబియా లాంటి ఎడారి ప్రాంతాల్లోనూ భారీ వరదలు సంభవిస్తున్నాయి. మరోవైపు, వందల ఏళ్లుగా ఒకే క్రమపద్ధతిలో కురిసే నైరుతి రుతుపవనాల తీరు కూడా మారిపోయింది.  కొన్ని రోజులు కుండపోతగా కురిసి, ఆ తర్వాత 20-25 రోజుల పాటు వర్షాల జాడే లేకుండా పోతోంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉంటున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గణాంకాలు చెబుతున్నాయి. 

 
పశ్చిమాసియాలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడుతున్న అల్పపీడన గాలులు, ఇక్కడి నైరుతి రుతుపవనాలతో కలవడం వల్ల ఉత్తర భారతదేశంలో అతి భారీ వర్షాలు పడుతున్నాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ శాస్త్రవేత్త అక్షయ్ దేవరాస్ తెలిపారు. దీని ప్రభావం దక్షిణాదిపైనా ఉంటోందని ఆయన వివరించారు.  ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి దేశవ్యాప్తంగా సాధారణం కంటే 8 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది 32 శాతం అదనంగా ఉంది. అయితే తూర్పు రాష్ట్రాల్లో మాత్రం 18 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం.