అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!

అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!

అమెరికాలో ఉన్నత భవిష్యత్తు కోసం వెళ్లిన తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కాలిఫోర్నియాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ (30) మరణించాడు. అయితే, ఈ ఘటనపై పోలీసులు చెబుతున్న కారణాలకు, కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలకు మధ్య తీవ్ర వైరుధ్యం కనిపిస్తుండటం గమనార్హం. ఇది కచ్చితంగా జాతి వివక్షతో జరిగిన హత్యేనని కుటుంబం ఆరోపిస్తోంది.

పోలీసుల కథనం ప్రకారం, శాంటా క్లారా నగరంలోని నిజాముద్దీన్ నివాసంలో ఈ నెల 3న ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో కత్తిపోట్లు జరుగుతున్నాయని 911కు సమాచారం అందడంతో తాము అక్కడికి వెళ్లామని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకునేసరికి, నిజాముద్దీన్ తన రూమ్మేట్‌ను కత్తితో పొడుస్తూ, కిందపడేసి దాడి చేస్తున్నాడని పేర్కొన్నారు. 

 
ఈ క్రమంలోనే నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని, తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని వివరించారు. గాయపడిన రూమ్మేట్‌కు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. అయితే, పోలీసుల వాదనను నిజాముద్దీన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు.  అసలు పోలీసులకు సహాయం కోసం ఫోన్ చేసిందే నిజాముద్దీన్ అని వారు చెబుతున్నారు.
నిజాముద్దీన్ గత కొంతకాలంగా జాతి వివక్ష, వేతన వేధింపులు, ఉద్యోగం నుంచి అన్యాయంగా తొలగించడం వంటి సమస్యలతో సతమతమవుతున్నాడని వారు తెలిపారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నిజాముద్దీన్ గతంలో పెట్టిన ఒక లింక్డ్‌ఇన్ పోస్టును వారు ఉదహరించారు.  “నేను జాతి విద్వేషం, వివక్ష, వేధింపులకు బాధితుడిని. శ్వేతజాతి ఆధిపత్యం అంతం కావాలి” అని ఆ పోస్టులో నిజాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబం గుర్తుచేసింది.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని నిజాముద్దీన్ కుటుంబం డిమాండ్ చేస్తోంది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సహాయం చేయాలని భారత విదేశాంగ శాఖను కోరింది. ఈ విషయంపై ఎంజేటీ ప్రతినిధి అమ్జెద్ ఉల్లా ఖాన్, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. నిజాముద్దీన్ మృతిపై పూర్తి నివేదిక తెప్పించుకుని, మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం శాంటా క్లారా పోలీసులు, జిల్లా అటార్నీ కార్యాలయం సంయుక్తంగా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నాయి.