అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా
అహ్మాదాబాద్‌లో ఈ ఏడాది జూన్ 12వ తేదీన ఎయిర్ ఇండియా విమానం కూలిన దుర్ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు అమెరికా కోర్టులో కేసు దాఖ‌లు చేశాయి. బోయింగ్‌, హానీవెల్ సంస్థ‌ల‌పై ఆ కేసు వేశారు. నాసిర‌కంగా ఇంధ‌న స్విచ్‌ల‌ను త‌యారు చేసేందుకు కేసు బుక్ చేశారు. ఆ విమాన ప్ర‌మాదంలో 260 మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. 
 
బాధితుల్లో నాలుగు కుటుంబాలు అమెరికాలో డెలావేర్ కోర్టులో ఆ రెండు కంపెనీల‌పై కేసు న‌మోదు చేశారు.  బోయింగ్‌, హానీవెల్ కంపెనీలు ఫ్యుయ‌ల్ స్విచ్‌లు త‌యారు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అహ్మాద్‌బాద్ నుంచి లండ‌న్‌కు వెళ్తున్న ఫ్ల‌యిట్ 171 ఆ రోజున టెకాఫ్ తీసుకున్న సెక‌న్ల‌లోనే నేలకూలింది. ఇంధ‌న స్విచ్‌ల్లో లోపం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. 
 
2018 ఎఫ్ఏఏ అడ్వైజ‌రీ ప్ర‌కారం ఫ్యుయ‌ల్ క‌టాఫ్ స్విచ్‌ల‌ను త‌నిఖీ చేయాల‌ని, కానీ అలా జ‌ర‌గ‌లేద‌ని ఆరోపించారు. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన కాంటాబెన్ ధీరూభాయ్ పగాద‌ల్‌, న‌వ్య చిరాగ్ ప‌గాద‌ల్‌, కుబేర్భాయ్ ప‌టేల్, బాబీబెన్ ప‌టేల్ కుటుంబీకులు అమెరికా కోర్టులో న‌ష్ట‌ప‌రిహారం కేసు వేశారు.

మరోవంక, అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం ‘అధికారిక దర్యాప్తు’ చేపట్టాలని ఎయిర్‌ఇండియా డ్రీమ్‌లైనర్‌ పైలెట్లలో ఒకరైన కెప్టెన్‌ సుమీత్‌ సభర్వాల్‌ తండ్రి పుష్కరాజ్‌ సభర్వాల్‌ కోరారు. విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఎఎఐబి) ఇచ్చిన ప్రాథమిక నివేదికపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సుమీత్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని, దీంతో మరణం గురించి ఆలోచిస్తున్నాడని నివేదిక నుండి లీకైన సమాచారం తెలిపిందని, పౌరవిమానయాన కార్యదర్శి, ఎఎఐబి డైరెక్టర్‌ జనరల్‌కు రాసిన లేఖలో పుష్కరాజ్‌ పేర్కొన్నారు. ఈ అసత్యాలు తన ఆరోగ్యం, మానసిక స్థితిని ప్రభావితం చేశాయని, ఇవి కెప్టెన్‌ సబర్వాల్‌ ప్రతిష్టను దెబ్బతీశాయని తెలిపారు. 

ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం భారత పౌరుడికి హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కు అని ఆగస్టు 29 నాటి లేఖలో పేర్కొన్నారు. విమానం (ప్రమాదాలు మరియు సంఘటనల దర్యాప్తు) నియమాలు, 2017లోని నిబంధన 12 ప్రకారం ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం అధికారిక విచారణకు ఆదేశించాలని పుష్కరాజ్‌ డిమాండ్‌ చేశారు. విమాన ప్రమాదానికి గురైన సమయంలో, అటువంటి దర్యాప్తు నిర్వహించడం సముచితమని అనిపిస్తే, ఆ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక దర్యాప్తును చేపట్టాలని కోరారు.

తన కుమారుడు మానసిక ఆరోగ్యం గురించి వస్తున్న ఊహాగానాలను కూడా ఆయన తోసిపుచ్చారు. సుమిత్‌ విడాకులు తీసుకున్నాడని, ఇటీవల ఆయన తల్లి మరణించారని, దీంతో ఆయనకు జీవితంపై నిరాశ చెందారని నివేదిక పేర్కొనడాన్ని తప్పుపట్టారు.