
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన ఓట‌్ల చోరీ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓట్లను ఆన్‌లైన్ ద్వారా తొలగించటం అసాధ్యమన్న ఈసీ, ఆయన చేసిన ఆరోపణలు అవాస్తవం, నిరాధారమని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. రాహుల్‌గాంధీ పొరపాటుగా భావించినట్లు ఏ ఒక్కరూ కూడా ఆన్‌లైన్ ద్వారా మరొకరి ఓటును తొలగించలేరని స్పష్టం చేసింది.
తన వాదన వినిపించేందుకు ఓటు కోల్పోయిన బాధితుడికి అవకాశం ఇవ్వకుండా ఓటు తొలగించటం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఓట్ల చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నవారిని సీఈసీ జ్ఞానేష్‌కుమార్ కాపాడుతున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించిన నేపథ్యంలో ఈసీ ఈ మేరకు వివరణ ఇచ్చింది.
“సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించడం లేదు. ఆన్‌లైన్‌లో మరెవరూ తొలగించలేరు. 2023లో అలంద్ అసెంబ్లీ నియోజవర్గంలో ఓటర్ల తొలగింపునకు ఇలాంటి విఫల ప్రయత్నాలు జరిగాయి. ఆ వ్యవహారంపై దర్యాప్తు కోసం ఎన్నికల సంఘమే ఫిర్యాదు చేసింది. రికార్డుల ప్రకారం అలంద్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. 2023లో కాంగ్రెస్ నేత బీఆర్ పాటిల్ విజయం సాధించారు” అని ఎన్నికల కమిషన్ వివరించింది.
మరోవైపు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని రాహుల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్, నేపాల్ తరహా అశాంతి భారత్‌లో సృష్టించాని రాహుల్ భావిస్తున్నారని బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 90 ఎన్నికల్లో ఓడిపోయిందని, దాంతో ఆయన అసహనం రోజురోజుకూ పెరుగుతోందని ఎద్దేవా చేశారు. క్షమాపణలు కోరడం, కోర్టు మందలింపులు ఆయనకు సాధారణంగా మారిపోయాయని తెలిపారు.
“రాహుల్‌కు రాజ్యాంగం, చట్టం అర్థం కావడం లేదు. 2014 నుంచి మోదీజీ సాధిస్తున్న విజయాలన్నీ నిజం కాదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు దేశ ప్రజలకు, ఓటర్లకు అవమానం. ఆయన బాంబు గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నాను.”అని మాజీ కేంద్రమంత్రి రవిశంకర్ విమర్శించారు.
అంతకుముందు సాఫ్ట్‌వేర్ వాడి ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని విమర్శించారు. రాష్ట్రం బయట నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించినట్లు తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు డిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
More Stories
హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీకి సెబీ క్లీన్చిట్
గగన్‌యాన్ ‘వ్యోమమిత్ర’లో ఏఐ ఆధారిత రోబో
అన్ని మతాలను గౌరవిస్తాను