మోదీ విప్లవాత్మక నేత అంటూ డా. వకుళాభరణం గ్రంధం

మోదీ విప్లవాత్మక నేత అంటూ డా. వకుళాభరణం గ్రంధం
ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు “శ్రీ నరేంద్ర మోదీ – విప్లవాత్మక ప్రపంచ నాయకుడు” అనే త్రిభాషా పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు రచించిన ఈ పుస్తకం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సిద్ధమైంది.
 
మోదీ రాజకీయ ప్రస్థానం, ఆర్థిక సంస్కరణలు, సామాజిక న్యాయం పట్ల కట్టుబాటు, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ట, గ్రామీణాభివృద్ధి దిశగా ఆయన చేసిన కృషి ఇందులో విపులంగా వివరించబడ్డాయి. పుస్తకావిష్కరణ అనంతరం మాట్లాడుతూ రామచందర్ రావు 75వ జన్మదినోత్సవం సందర్భంలో మోదీ పరిపాలనలోని విశేషాలను గుర్తు చేసుకోవడం గర్వకారణం అని చెప్పారు.
 
“జీఎస్టీ సంస్కరణలు, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి పథకాలు కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చాయి. మోదీ గారి 75 ఏళ్ల జీవన యాత్ర దేశానికి స్ఫూర్తిదాయకం. వెనుకబడిన వర్గాల సాధికారతకు, సామాజిక న్యాయం సాధనకు ఆయన తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి” అని ఆయన కొనియాడారు. ఈ పుస్తకం మోదీ నాయకత్వాన్ని అధ్యయనం చేయదలచిన వారికి విలువైన ఆధారం అవుతుందని చెప్పారు. 
 
డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ  “మోదీ కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఒక దార్శనికుడు, ఒక యోగి. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం దేశ ప్రయోజనానికే అంకితం. మోదీ గారి 75 ఏళ్ల జీవన యాత్ర దేశానికి స్ఫూర్తిదాయకం” అని తెలిపారు. 
 
“వెనుకబడిన వర్గాల సాధికారతకు, సామాజిక న్యాయం సాధనకు ఆయన తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి. బలహీన వర్గాలకు అండగా నిలిచి, సంక్షేమం, అభివృద్ధి, సమానత్వం అనే మూడు సూత్రాలను ఆయన పాలనలో సమన్వయం చేశారు. అందుకే నేను ఈ పుస్తకాన్ని మూడు భాషల్లో సిద్ధం చేసి, ఆయన దూరదృష్టిని, ఆలోచనలను విస్తృత పాఠక వర్గానికి చేరవేయాలనుకున్నాను” అని ఆయన చెప్పారు.
 
మోదీ జీవనయానం, పాలన విధానం, సామాజిక న్యాయం పట్ల యన కట్టుబాటు – ఇవన్నీ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని డా. వకుళాభరణం  విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, బీజేపీ సీనియర్ నేత చింతా శంభామూర్తి, ఓబీసీ నేత మారుతి ప్రసాద్, దివాకర్ తదితరులు హాజరయ్యారు.