
ఏటా శీతాకాలంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతోన్న విషయం తెలిసిందే. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం దీనికి ఓ కారణమనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంట వ్యర్థాల దహనంపై దాఖలైన పిటిషన్లపై తాజాగా మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి పాల్పడుతున్న కొంతమందిని జైలుకు పంపితేనే మిగతా వారికి గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుందని వ్యాఖ్యానించింది.
శీతాకాలం ప్రారంభానికి ముందు వాయు కాలుష్యాన్ని నివారించడానికి మూడు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికను రూపొందించాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సిఏక్యూఎం) సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సిపిసిబి) రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం కాలుష్య నియంత్రణ బోర్డుల్లో ఖాళీల గురించి రాష్ట్రాలను ప్రశ్నించింది. ఉత్తర్ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో మూడు నెలల్లోగా ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించింది. సిఏక్యూఎం, సిపిసిబిలలో పోస్టులను భర్తీ చేయడానికి మరో ఆరు నెలల సమయం ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం.
ఈ అంశంపై అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ మాట్లాడుతూ పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండేందుకు రైతులకు సబ్సిడీలు, వివిధ పరికరాలు అందిస్తున్నట్టు తెలిపారు. అయినప్పటికీ ఉపగ్రహాలు ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లే సమయంలో కాకుండా మిగిలిన సమయాల్లో పంట వ్యర్థాలను కాల్చుకోవచ్చని అధికారులు తమకు చెప్పారనే కథనే రైతులు మళ్లీమళ్లీ చెప్తున్నారని న్యాయస్థానానికి వెల్లడించారు.
దీనిపై ఎన్నిసార్లు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఫలితం లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు రైతులకు శిక్ష, జరిమానా విధించాలనే కోణంలో ఎందుకు ఆలోచించట్లేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. రైతులు మనకు అన్నం పెడుతున్నారు కాబట్టి వారు ప్రత్యేకమైనవారని, అలా అని పర్యావరణాన్ని పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అని ప్రశ్నించింది. కొంతమందిని జైలుకు పంపితేనే మిగతా వారికి గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుందని తెలిపింది.
పర్యావరణాన్ని కాపాడాలనే నిజమైన ఉద్దేశం మీకు ఉంటే ఇటువంటి చర్యలకు ఎందుకు దూరంగా ఉంటారని అధికారులను ప్రశ్నించింది. కాగా, కాలుష్య నియంత్రణ బోర్డులలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంలో విఫలమైనందుకు రాష్ట్రాలను కోర్టు తీవ్రంగా విమర్శించింది. కాలుష్యం తీవ్రతరం అయ్యే సీజన్లలో తగినంత ఉద్యోగులు లేకపోవడం పర్యావరణ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని అభిప్రాయపడింది.
More Stories
ఇకపై ఈవీఎం బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల కలర్ ఫొటో!
16 వేల మంది విదేశీయులు దేశం నుంచి బహిష్కరణ
బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యాం పనులకు భారత్ శ్రీకారం