తృతీయ పక్షం జోక్యం ఒప్పుకొని భారత్.. పాక్ స్పష్టం

తృతీయ పక్షం జోక్యం ఒప్పుకొని భారత్.. పాక్ స్పష్టం
మొదటిసారిగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, రెండు దేశాల మధ్య వివాదాలపై భారతదేశం ఎప్పుడూ మూడవ పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని అంగీకరించారు.  భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలన్నీ అబద్ధాలని దీనితో తేలిపోయింది. ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని తాము కోరలేదని భారత్ ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించగా, భారత్ వాదనను దాయాది దేశమైన పాక్ కూడా తాజాగా అంగీకరించింది. 
 
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సమస్యలను తృతీయ పక్షం జోక్యంతో పరిష్కరించుకునే ప్రసక్తే లేదని భారత్ తేల్చిచెప్పిందని పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ వెల్లడించారు. అల్ జజీరా‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాక్ దార్ మాట్లాడుతూ, తృతీయ పక్షం జోక్యం అంశాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఇస్లాబాద్ ప్రస్తావించిందని, బయట వ్యక్తుల ప్రమేయానికి భారత్ ఒప్పుకోవడం లేదని ఆయన తనకు చెప్పారని తెలిపారు.
జూలై 25న ఇదే విషయాన్ని వాషింగ్టన్‌లో తాను తిరిగి రూబియాతో ప్రస్తావించినట్టు చెప్పారు. పూర్తిగా ఇది ద్వైపాక్షికంగానే పరిష్కారం కావాల్సిన అంశమని భారత్ తెగేసి చెప్పినట్టు ఆయన తిరిగి సమాధానమిచ్చారని ఇషాక్ దార్ తెలిపారు.  ట్రంప్ గత మే నుంచి అమెరికా యంత్రాంగం జోక్యంతోనే రెండు అణ్వస్త్రదేశాల మధ్య యుద్ధం ఆగిపోయిందని చెబుతూ వస్తున్నారు. 
 
అయితే ఆయన వాదనను భారత్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. భారత్-పాక్ దేశాల డీజీఎంఓలు మాట్లాడుకున్న తర్వాతే కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కాగా, భారత్‌తో వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చకు పాక్ సిద్ధంగానే ఉందని, అయితే సమగ్ర చర్చ జరగాలని, ఉగ్రవాదం, వాణిజ్యం, ఎకానమీ, జమ్మూకశ్మీర్ అంశాలు ఈ చర్చలో ఉండాలని ఇషాక్ దార్ తెలిపారు. 

“మూడవ పక్షం ప్రమేయానికి మేము అభ్యంతరం చెప్పము.కానీ భారతదేశం ఇది ద్వైపాక్షిక విషయం అని స్పష్టంగా చెబుతోంది. ద్వైపాక్షికం మాకు అభ్యంతరం లేదు. కానీ సంభాషణలు ఉగ్రవాదం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, జమ్మూ కాశ్మీర్, మనం ఇంతకు ముందు చర్చించిన అన్ని అంశాలపై సమగ్రంగా ఉండాలి” అని దార్ తెలిపారు. “మేము ఏదీ అడుక్కోం. ఏ దేశం చర్చలు కోరుకున్నా మేము సంతోషిస్తాం, స్వాగతిస్తాం. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని మేము నమ్ముతాం. ఇది ఇరువైపులా సహకరించుకుంటేనే సాధ్యమవుతుంది. ఇండియా చర్చలు కోరుకోనప్పుడు మేము బలవంతం చేయలేం” అని దార్ తెలిపారు.