జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు పెద్ద ఊతం

జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు పెద్ద ఊతం

జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌కు పెద్ద ఊతం అని చెబుతూ  దేశంలోని 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు ఈనెల 22 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. విశాఖపట్నంలోని మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు.

‘‘ఇప్పటికే అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు చేకూరాయి. నాలుగు శ్లాబ్‌ల నుంచి రెండు శ్లాబ్‌లకు తగ్గించాం. 12 శాతంలో ఉండే వస్తువులు దాదాపు 99 శాతం 5 శాతం శ్లాబ్‌ పరిధిలోకి తీసుకొచ్చాం. 28 శాతం శ్లాబ్‌లో ఉండే సిమెంట్‌ సహా 90 శాతం వస్తువులు 18 శాతం శ్లాబ్‌ పరిధిలోకి తెచ్చాం” అని ఆమె గుర్తు చేశారు.  “2017కు ముందు 17 రకాల పన్నులు ఉండేవి వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవి. ఉదాహరణకు 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. అన్నింటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే పన్ను, నాలుగు శ్లాబ్‌ల రూపంలో తీసుకొచ్చిందే జీఎస్టీ” అని ఆమె చెప్పారు.

2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19 లక్షల కోట్ల ఆదాయం రాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.22.08 లక్షల కోట్ల ఆదాయం లభించిందని ఆమె తెలిపారు. ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ తీసుకొచ్చామని పేర్కొంటూ పాలు, పెరుగు సహా పలు నిత్యావసరాలను 5 శాతం శ్లాబ్‌ నుంచి సున్నా శాతానికి తీసుకొచ్చామని సీతారామన్ వివరించారు.

జీఎస్టీ 2.0 తీసుకొస్తే ఎనిమిదేళ్లు ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేసినట్లు ఒప్పుకుంటున్నారా? అని ప్రతిపక్షాలు మాట్లాడుతుండటం హాస్యాస్పదమని ఆమె తెలిపారు. పదేళ్లు జీఎస్టీ తీసుకురాకుండా కాలయాపన చేసిన యూపీఏ ప్రభుత్వానికి జీఎస్టీపై మాట్లాడే అర్హత లేదని ఆమె స్పష్టం చేశారు. వాళ్ల గురించి మాట్లాడాలంటే బూతులొస్తున్నాయంటూ  రాజకీయంగా బదులిచ్చేందుకు సమయం ఉందని చెప్పారు. ప్రిడ్జ్, వాషింగ్ మెషీన్లపై యూపీఏ ప్రభుత్వంలో 30 శాతం పన్ను ఉంటే ఇప్పుడు 18 శాతానికి వచ్చిందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు.

“ఆత్మనిర్భర్‌ భారత్‌కు జీఎస్టీ నూతన సంస్కరణలు పెద్ద ఊతం. మహిళల ఆరోగ్యం కోసం శానిటరీ న్యాప్‌కిన్స్‌పై పన్నును సున్నా చేశాం” అని ఆమె చెప్పారు. “యూపీఏ ప్రభుత్వంలో 30 శాతం ఉన్న వస్తువులను ఇప్పుడు 5 శాతానికి తెచ్చాం. సరళతరమైన పన్ను విధానాన్ని తీసుకురాలేని వాళ్లు ఇప్పుడు విమర్శలు చేస్తారా? గతంలో 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేవాళ్లు. ఈ 8 ఏళ్లలో ఆ సంఖ్య 1.51 కోట్లకు చేరింది’’ అని నిర్మలా సీతారామన్‌ వివరించారు.

ఐదు విభాగాలు చేసి ఏ స్లాబ్‌లో ఏ వస్తువులు ఉండాలో నిర్ణయించామని, ఇప్పటికే అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు చేకూరాయని ఆమె చెప్పారు. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేశామని తెలిపారు. పురుగు మందులు, డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలను దృష్టిలో పెట్టుకున్నాం. ఎంఎస్‌ఎంఈల దిగుమతులు, ఎగుమతులపై ఆలోచించామని నిర్మలా సీతారామన్‌ వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రసంగించారు.