జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థత వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిందని తెలిపారు. పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా నిర్వహించింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న వేడుకలకు మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత పరేడ్ మైదానంలోని అమర జవాన్ల స్మృతి స్థల్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సర్దార్ వల్లభాయ్ విగ్రహానికి నివాళులు అర్పించారు. భద్రతా బలగాల గౌరవవందనం స్వీకరించారు.
నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారన్న రాజ్నాథ్సింగ్ వారి ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని గుర్తుచేశారు. పటేల్ సమర్థత వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిందని తెలిపారు. 1947లో భారత దేశం స్వాతంత్ర్యం పొందిన సమయంలో వివిధ రాజ్యాలు ఉండేవని, వాటివల్ల భారతదేశ ఐఖ్యత్వం ఇబ్బందికరంగా ఉండేదని గుర్తుచేశారు. అఖండ భారత్ నినాదంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందుకు వెళ్ళారని కేంద్ర మంత్రి తెలిపారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసంతోనే ఆనాడు భారత్ బలంగా నిలబడిందని చెప్పుకొచ్చారు. మహాత్మా గాంధీ కూడా సర్దార్ పటేల్ నిర్ణయాలను మెచ్చుకున్నారని చెప్పారు. నిజాం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, ఆపరేషన్ పోలో పేరుతో సర్దార్ పటేల్ నిజాంను ఓడించారని వెల్లడించారు. ఆపరేషన్ పోలో రజాకార్ల ఆగడాలను అరికట్టడానికి సర్దార్ పటేల్ తీసుకున్న నిర్ణయమని తెలిపారు. తుష్టికరణ రాజకీయాల కోసం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని విమర్శించారు.
హిందువులే లక్ష్యంగా రజాకార్లు అత్యాచారాలు, హత్యలు చేసారని పేర్కొంటూ పహల్గాంలో కూడా రజాకార్ల తరహాలో హత్య చేశారని, ఆపరేషన్ సింధూర్ పేరుతో వారికి తగిన బుద్ధి చెప్పామని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. నిజాం భారత్కు మాత్రమే వ్యతిరేకం కాదని, భారత ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇప్పటికీ దేశంలో రాజాకార్లు ఉన్నారని, ధర్మం పేరుతో దేశంలో విచ్చిన్నం సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
భారతదేశం ఏ శక్తీ ముందు తలదించలేదని, భవిష్యత్తులో తలదించబోదని స్పష్టం చేశారు. ఆనాడు సర్దార్ పటేల్ అఖండ భారత్ కోసం ప్రయత్నం చేశారని, ఇప్పుడు ప్రధాని మోదీ ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని రాజ్ నాథ్ చెప్పారు.
ప్రధాని మోదీ ఆదేశాలతో విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందన్న మరో కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారిని కేంద్రం గుర్తించి గౌరవిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17న ఎందుకు జాతీయ జెండా ఎగరవేయడం లేదో చెప్పాలని మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పేర్లు మార్చి వేడుకలు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు.
అమిత్ షా చొరవ వల్లే కేంద్రం తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్న కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు రాష్ట్ర పాలకులు అధికారికంగా వేడుకల్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గల్లీ గల్లీలో జాతీయ జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు.
ప్రసంగాల అనంతరం పరేడ్ మైదానంలో కేంద్ర సాంసృతిక శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను రాజ్నాథ్ తిలకించారు. అంతకుముందు విమోచన దినోత్సవంలో భాగంగా ప్రదర్శించిన తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలైన బతుకమ్మ, బోనాలు, కోలాటం, మహిళల డప్పు నృత్యాలు, కోమ్ము కోయ, గుస్సాడి, థింసా నృత్యాలు ఆకట్టుకున్నాయి.
More Stories
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం
విద్యుత్తు ఏడీఈ అక్రమార్జన రూ. 200 కోట్లు… ఎసిబి అరెస్ట్
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తం