
ఖతార్‌లో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఐక్యంగా స్పందించిన అరబ్, ఇస్లామిక్ దేశాలకు చెందిన పలువురు నాయకులు సోమవారం దోహాలో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడంపై తీసుకోవలసిన చర్యల విషయంలో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అరబ్ సైనిక కూటమి ఏర్పాటుపై మాత్రం వారు ఏకాభిప్రాయానికి వచ్చారు.
అరబ్ ప్రపంచంలో అతి పెద్ద సైనిక పంపత్తి గల ఈజిప్టు ఈ అరబ్ సైనిక కూటమికి అరబ్ నాటో అని నామకరణం చేయగా, దోహాలో జరిగిన అత్యవసర సమావేశానికి పాకిస్థాన్, తుర్కియే కూడా హాజరయ్యాయి. అణ్వస్ర్తాలు గల ఏకైక ముస్లిం దేశమైన పాకిస్థాన్ ఈ అత్యవసర సమావేశంలో పాల్గొనడంతోపాటు ఇజ్రాయెలీ కుట్రలను కనిపెట్టేందుకు ఓ ఉమ్మడి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది.
ఇజ్రాయెల్‌ని ఆర్థికంగా దెబ్బతీయాలని తుర్కియే అధ్యక్షుడు తయ్యీప్ ఎర్డోగన్ ఈ సమావేశంలో సూచించారు. నాటో తరహాలో అరబ్, ఇస్లామిక్ దేశాలు ఉమ్మడి భద్రతా వ్యవస్థను నిర్మించుకోవాలని ఇరాక్ ప్రధాని మొహమ్మద్ సుడానీ కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 34 దేశాల ఇస్లామిక్ కూటమి ఏర్పాటుకు సౌదీ అరేబియా గతంలోనే ప్రతిపాదించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా తన మిత్రదేశాలతో భద్రతా ఒప్పందాలను పునఃపరిశీలిస్తున్న తరుణంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకోవడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈజిప్టు రాజధాని కైరోలో అరబ్ నాటో ప్రధాన కార్యాలయం ఉండాలని ఈజిప్టు ప్రతిపాదిస్తోంది. ఉమ్మడి సైన్యం కోసం తమ వంతుగా 20,000 మంది బలగాలను సమకూర్చడానికి ఈజిప్టు సంసిద్ధత తెలిపింది.
ఉమ్మడి బలగాలకు తొలి కమాండర్‌గా ఈజిప్టుకు చెందిన ఫోర్ స్టార్ జనరల్ ఉండాలని కూడా ఈజిప్టు ప్రతిపాదించింది. 22 అరబ్ లీగ్ సభ్యుల మధ్య సైనిక నాయకత్వం పరిభ్రమిస్తుంటుందని, భూమి, వాయు, నౌకాదళానికి చెందిన సేనలతోపాటు కమాండో యూనిట్లు ఇందులో భాగమై ఉంటాయని, వాటికి సమగ్ర శిక్షణతోపాటు లాజిస్టిక్స్ కూడా ఉమ్మడిగా సమకూర్చుకోవడం ఉంటుందని ఈజిప్టు ప్రతిపాదించింది.
డిప్యూటీ కమాండ్ బాధ్యతను నిర్వహించడానికి సౌదీ అరేబియా ఆసక్తిని కనబరుస్తోంది. యూఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు నిధుల సమీకరణ, అధునాతన ఆయుధ సంపత్తి సేకరణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. తమ అరబ్ నాటో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ ఛత్రంగా పనిచేస్తుందే తప్ప ప్రతిఘటన కూటమిగా కాదని ఈ సమావేశంలో పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.
దోహాలో హమస్ నేతలపై ఇజ్రాయిల్ జరిపిన దాడులు నమ్మకద్రోహంతో కూడిన పిరికిపంద చర్య అని ఖతార్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి జిసిసి భాగస్వామ్య దేశాలైన బహరైన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశాధినేతలు, ప్రతి నిధులు హాజరయ్యాయి. సభ్య దేశాలు భద్రతా పరంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిసిసి ఓ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
గల్ఫ్ దేశాలు తమ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించాయని, త్వరలోనే దోహాలో యూనిఫైడ్ మిలిటరీ కమాండ్ సమావేశం జరుగుతుందని ఖతార్ విదేశాంగ ప్రతినిధి మహమ్మద్ అల్-అన్సారీ తెలిపారు.
జిసిసి ప్రధానకార్యదర్శి జసేమ్ మహమ్మద్ అల్‌బుదైవీ మాట్లాడుతూ అమెరికా తన సన్నిహిత భాగస్వామి ఇజ్రాయిల్‌ను అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. ఖతార్‌పై మరోసారి దాడి చేస్తామంటూ ఇజ్రాయిల్ చేస్తున్న బెదిరింపులను జిసిసి సభ్య దేశాలు ఖండించాయి. ఇజ్రాయిల్ కనుక అలాంటి చర్యకు పూనుకుంటే అంతర్జాతీయ సమాజం ముందు దానిని దోషిగా నిలబెడతామని తెలిపాయి.
More Stories
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తం
తృతీయ పక్షం జోక్యం ఒప్పుకొని భారత్.. పాక్ స్పష్టం
అస్సాంలో ముస్లింలకు హిందువుల భూముల బదిలీల్లో అవినీతి!