
రాజకీయాల్లో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర ఈ రోజుల్లో చాలా కీలకమని పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఉద్ఘాటించారు. రాష్ట్ర, కేంద్ర, కేంద్ర పాలిత ప్రాంతాల మహిళా ప్రజాప్రతినిధుల అర్థవంతమైన ఆలోచనలు పంచుకోవడానికి ఈ సదస్సు వేదిక అయ్యిందని ఆమె చెప్పుకొచ్చారు. తిరుపతిలోని రాహుల్ కన్వన్షన్ వేదికగా రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ మహిళా సాధికారత సదస్సులో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను వివరించారు.
మహిళలు, ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సదస్సులో చర్చకు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. మారుతున్న సమాజానికి జాతీయ మహిళా సాధికారత సదస్సు ఓ నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. 2047కి వికసిత్ భారత్ సాధనలో మహిళలు ముందుండి నడిపించాలని ఆమె ఆకాంక్షించారు. విద్యా, వైద్యం, పరిపాలన, వ్యాపార రంగాలలో మహిళలు ముందు ఉండాలని పేర్కొన్నారు. మహిళలు వృద్ధిలో భాగం కావడం కాదని, వృద్ధిని ముందుండి నడిపించాలని ఆమె సూచించారు.
ఆశా వర్కర్స్ నుంచి ఐఏఎస్ వరకు మహిళల సంఖ్య పెరుగుతూ ఉందని చెప్పారు. మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు కేంద్రం నుంచి 70, రాష్ట్రాల నుంచి 400 పథకాలు ఉన్నాయని ఆమె వివరించారు. వికసిత భారత్ సాధన అనే లక్ష్యం దేశంలో మహిళల ప్రగతిపై ఆలోచనను మార్చిందని పురందేశ్వరి తెలిపారు. వికసిత భారత్ కోసం మహిళా అభివృద్ధి ‘జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్’ ఈ రెండు అంశాలపై డిబేట్ జరిగిందని వివరించారు.
మహిళాశక్తి వెనుక ఉండి నడపటం కాదని… ముందు వరుసలో ఉండి నడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. వికసిత భారత్‌లో మహిళలది ప్రధాన పాత్ర అని ఉద్ఘాటించారు. మహిళల ప్రగతితోనే వికసిత భారత్ సాధ్యమని పురందేశ్వరి స్పష్టం చేశారు.
మహిళా సాధికారత మహిళలకే పరిమితం కాదని, సమాజం మొత్తానికి స్వేచ్ఛ, బలమైన ప్రజాస్వామిక సమాజాన్ని ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. సతి, బాల్య వివాహాలు వేదకాలంలో లేవని చెప్పుకొచ్చారు. మహిళలు గౌరవించబడిన చోట దైవత్వం వికసిస్తోందని చెప్పటం ద్వారా వేదకాలంలో మహిళలను ఎంతగా గౌరవించేవారో మనుస్మృతి స్పష్టం చేస్తోందని ఆయన ఉద్ఘాటించారు.
భారతదేశంలో మహిళల సమానత్వానికి మతం ఎంతో పెద్ద పాత్ర పోషించిందని నొక్కిచెప్పారు. ఒక కుటుంబంలో మహిళ ఆనందంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుందని, ఇదే దేశం మొత్తానికి వర్తిస్తుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. “వైదిక భారతదేశంలో మహిళలకు విద్యా అవకాశాలు అన్ని వర్గాలకు అందేవి. కవయిత్రి మొల్ల, సంస్కృతంలోని రామాయణాన్ని తెలుగులోకి అనువదించారు. రాజా రామ్ మోహన్ రాయ్ బాల్య వివాహాల రద్దు, వింతంతు పునర్వివాహ చట్టాలను తీసుకువచ్చారు” అని ఆయన గుర్తు చేశారు.
“మార్పు మాత్రమే లోకంలో శాశ్వతమైనది. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. మహిళల రక్షణ హక్కుల కోసం అనేక తీర్పులు, అనేక చట్టాలను భారతదేశం చేసింది. అయితే మహిళలను రాజకీయంగా ముందుకు తీసుకుపోవటంలో ఇండియా వెనుకబడి ఉంది” అని గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరించారు.
“మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించటంలో 193 దేశాల్లో 148వ ర్యాంకులో భారతదేశం ఉంది. మిజోరం వంటి రాష్ట్రాల్లో ఒక్క సభ్యురాలు కూడా అసెంబ్లీలో లేరు. మహిళలకు రాజకీయ అవకాశాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం. రాబోయే రోజుల్లో అమలు కానున్న మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఈ లోటును మారుస్తుంది. ఇది ప్రపంచానికి భారతదేశం గొప్పతనాన్ని చాటి చెప్పనుంది” అని గవర్నర్ పేర్కొన్నారు.
More Stories
చరిత్రలో తెలంగాణ విమోచనకు అత్యంత ప్రాముఖ్యత
సుంకాలతో సగం రొయ్యల ఎగుమతులు.. రూ 25,000 కోట్ల నష్టం
అమెరికా చెప్పినట్లు టారిఫ్ విధిస్తే ప్రతిచర్యలు