ముగ్గురు మంత్రులతో నేపాల్ మంత్రివర్గం విస్తరణ

ముగ్గురు మంత్రులతో నేపాల్ మంత్రివర్గం విస్తరణ

నేపాల్‌ తాత్కాలిక ప్రధాని సుశీల్‌ కర్కి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. రామ్‌షోర్‌ ఖనాల్‌, కుల్మాన్‌ ఘిసింగ్‌, ఓంప్రకాష్‌ ఆర్యల్‌లతో నేపాల్‌ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ సోమవారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల తర్వాత కర్కి ఆదివారం రామెషోర్‌ ఖనాల్‌ను ఆర్థికమంత్రిగా, విద్యుత్‌ మంత్రిగా కుల్మాన్‌ ఘిసింగ్‌, హోంమంత్రిగా ఓం ప్రకాష్‌ ఆర్యల్‌లతో మంత్రివర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆర్థికమంత్రిగా బాద్యతలు చేపట్టిన రామ్‌షోర్‌ ఖనాల్‌  మాజీ ఆర్థిక కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి 400 పేజీలకు పైగా సిఫారసును ఇటీవల నేపాల్‌ మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలి ప్రభుత్వానికి సమర్పించారు.  నేపాల్‌ రాష్ట్ర బ్యాంక్‌, నేపాల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ, వ్యవసాయ అభివృద్ధి బ్యాంక్‌, నేపాల్‌ టెలికాం కంపెనీ,  నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ కార్పోరేషన్‌ సహా పలు ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థల్లలో కీలక పదవులు చేపట్టిన  ఖనాల్‌ నేపాల్‌ ఆర్థికరంగంలో సవరణల కోసం దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు.

విద్యుత్‌ మంత్రి కుల్మాన్‌ ఘిసింగ్‌ నేపాల్‌ విద్యుత్‌ అథారిటీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. దీర్ఘకాలిక విద్యుత్‌ అంతరాయాలకు చెక్‌పెడుతూ.. 2016 తర్వాత మొదటిసారిగా ప్రజలకు 24 గంటల పాటు విద్యుత్‌ను అందించారు. ఈ విజయాన్ని పలువురు ‘ అద్భుతం’గా అభివర్ణించారు.

హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆర్యల్‌ సుప్రీంకోర్టు న్యాయవాదిగా, అవినీతిని సవాలు చేయడంలో, ఉన్నత స్థాయి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేయడంలో ప్రసిద్ధి పొందారు. నేపాల్‌ ప్రధాని కార్కికి సన్నిహితులైన ఆయన, పార్లమెంట్‌ రద్దుపై ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు అధ్యక్షుడు రామ్‌ చంద్ర పౌడెల్‌తో చర్చలు జరపడంలో కీలక పాత్ర పోషించారు.