నేడు భారత్‌-అమెరికా వాణిజ్య చర్చలు

నేడు భారత్‌-అమెరికా వాణిజ్య చర్చలు
 
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్ ఎగుమతులపై ట్రంప్ 50 శాతం సుంకాల భారం విధించడం తో ఇరు దేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో తలెత్తిన అనిశ్చితిని తొలగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఇందులో భాగంగా సోమవారం రాత్రి అమెరికా ప్రతినిధి, ట్రంప్ సహాయకుడు, దక్షిణ మధ్య ఆసియాకు అసిస్టెంట్ యూఎస్ ట్రేడ్ ప్రతినిధి బ్రెన్డన్ లించ్ భారత్‌కు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
మంగళవారం రెండు దేశాల మధ్య తిరిగి చర్చలు జరుగుతాయని ప్రభుత్వ వాణిజ్య చర్చలు అధికారులు తెలిపారు.  గత మార్చి నుంచి ఉభయ దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఇంతవరకు ఐదు దఫాలుగా చర్చలు జరగ్గా, ఆరో దఫా చర్చల కోసం అమెరికా బృందం ఆగస్టు 25- 29 మధ్య భారత్ రావలసి ఉన్నప్పటికీ అది రద్దయింది. ఇది ఆరో రౌండ్ చర్చలే కాదు, వాణిజ్యంపై కచ్చితంగా భవిష్యత్ చర్యలను నిర్ణయించే చర్చలని, అమెరికాతో ఒప్పందం కుదరడానికి ప్రయత్నిస్తామని భారత్ ప్రధాన ప్రతినిధి, వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. 
 
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అగ్రరాజ్యం విధించిన 50శాతం సుంకాలు అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా, మరోవైపు ఇరుదేశాల మధ్య చర్చలు సానుకూలంగానే కొనసాగుతున్నాయని భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూశ్ గోయల్ ఇటీవల తెలిపారు. ఇరు పక్షాలు ఈ చర్చలపై సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. మొదటి విడత ఒప్పందం నవంబర్ నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
 
మరోవంక, భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న వేళ ట్రంప్‌ సర్కార్‌ నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ముందస్తు బెదిరింపులు మొదలయ్యాయి. అమెరికాలో పండించిన మక్క పంటను భారత్‌ కొనుగోలు చేయడానికి నిరాకరిస్తే అమెరికన్‌ మార్కెట్‌కు భారత్‌ దూరం కావలసి వస్తుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లుత్నిక్‌ హెచ్చరించారు. ఆక్సియోస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లుత్నిక్‌ మాట్లాడుతూ భారత్‌-అమెరికా సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

బీబీసీ నివేదిక ప్రకారం చైనా ఆర్థిక ఆంక్షల కారణంగా అమెరికా మక్కల కోసం చైనా నుంచి కొనుగోలు ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఫలితంగా అమెరికా సన్నకారు రైతులు దివాలా తీసినట్లు ప్రకటిస్తున్నారు. అమెరికా రైతులకు కొత్త మార్కెట్‌ను సృష్టించే లక్ష్యంతో ట్రంప్‌ ప్రభుత్వం మక్క ఎగుమతుల కోసం భారత్‌నే లక్ష్యంగా చేసుకున్నట్లు కనపడుతోంది.