బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన

బీహార్ లో ఆర్జేడీ, కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన
ఆర్జేడీ, కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన కారణంగా బిహార్ తీవ్రంగా నష్టపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రస్తుతం తాము చేపడుతున్న అభివృద్ధిని చూసి ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ధ్వజమెత్తారు. బిహార్‌లోని పూర్ణియా జిల్లాలో పర్యటించిన ప్రధాని, జాతీయ మఖానా బోర్డుతో పాటు రూ. 36 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 

పేదలకు మద్దతివ్వటమే తన మోటో అని ప్రధాని మోదీ తెలిపారు. అందులో భాగంగానే నాలుగు కోట్ల ఇళ్లను పేదలకు నిర్మించి ఇచ్చామని చెప్పారు. మరో మూడు కోట్ల గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని వెల్లడించారు. బిహార్ ప్రజలను కాంగ్రెస్ పార్టీ బీడీలతో పోల్చడాన్ని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఇది బీహారీలకు అవమానించడమే అవుతుందని మండిపడ్డారు. 

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఇండియా కూటమికి పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమ ప్రవేశిలకు ఆశ్రయం ఇచ్చిందని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం వారిని రాష్ట్రం నుంచి తరిమివేస్తుందని స్పష్టం చేశారు. బిహార్ దేశ అభివృద్ధి, భద్రత, రక్షణలో ఎప్పుడూ తమ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని ప్రధాని గుర్తు చేశారు.

ఆర్జేడీ, కాంగ్రెస్ నాయకులు కేవలం తమ కుటుంబాల గురించే ఆలోచిస్తారని మోదీ విమర్శించారు. తాను మాత్రం వికసిత్ భారత్ లక్ష్యంతోనే పని చేస్తానని తెలిపారు. బిహార్లో ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన ఎస్ఐఆర్ ప్ర‌క్రియ‌ను ఓటు బ్యాంకు రాజ‌కీయాల కోసమే వ్యతిరేకిస్తున్నాయని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్ గుర్తింపును కూడా ఆ పార్టీలు నాశ‌నం చేసిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. 

కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి చొర‌బాటుదారులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. విదేశాల నుంచి వచ్చిన వారి కోసం ఇలాంటి యాత్రలు చేస్తున్నారని అన్నారు. బిహార్ ప్రజలకు ఓ విషయం సరిగ్గా అర్ధం చేసుకోవాలనుకుంటున్నాని అన్నారు. చొర‌బాటుదారులు ఎవ‌రైనా వెళ్లిపోవాల్సిందే, వారని అడ్డుకునే బాధ్యత ఎన్డీఏకు ఉందని చెప్పారు.

ఇదే ర్యాలీలో ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రం, దేశం కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. “ప్రధానమంత్రి కొత్త టెర్మినల్ భవనమైన పూర్ణియా విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది” అని తెలిపారు. “బీజేపీ, జేడీయూ ప్రభుతం మొదట 2005 నవంబర్ 24 ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తోంది. ఇలాంటి తప్పులు మళ్లీ జరిగే ప్రశ్నే లేదు(మహాకూటమికి తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ). బీజేపీ జేడీయూ కలిసి పని చేస్తాయి” అని నీతీశ్ కుమార్ తెలిపారు.