ఆప‌రేష‌న్ సింధూర్ తో ముక్కలైన మ‌సూద్ కుటుంబం

ఆప‌రేష‌న్ సింధూర్ తో ముక్కలైన మ‌సూద్ కుటుంబం

భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ ఉగ్రవాద సంస్థలు కకావికలమైన విషయం మరోసారి రుజువైంది. స్వయంగా జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ కమాండర్ ఇలియాస్ కశ్మీరీ ఈవిషయాన్ని తాజాగా ఓ సభ వేదికగా వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

“మాపై వేసిన ఉగ్రవాదపు ముద్రను గుండెలపై మోస్తూ ఈ దేశం (పాకిస్థాన్) కోసం, దేశ సరిహద్దులను కాపాడటం కోసం మేం డిల్లీతో పోరాడాం. కాబూల్‌తో పోరాడాం. కాందహార్‌తో పోరాడాం. అన్నింటినీ త్యాగం చేశాం. మే 7న బహవల్‌పూర్‌పై భారత్ జరిపిన దాడిలో జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్ కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ముక్కలు ముక్కలైపోయారు” అని ఉర్దూలో ఇలియాస్ కశ్మీరీ వ్యాఖ్యలు చేశాడు. 

ఈ సభా వేదికపై ప్రసంగిస్తుండగా ఇలియాస్ కశ్మీరీ పక్కన, వెనుక, ముందు అంతటా ముసుగు ధరించిన సాయుధ మిలిటెంట్లు కాపలాగా ఉండటం గమనార్హం. బహవల్‌పూర్‌ విషయానికొస్తే, ఇది పాకిస్థాన్‌లోని 12వ అతిపెద్ద నగరం. జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు ఈ నగరమే ఆయువుపట్టు. లాహోర్‌కు దాదాపు 400 కి.మీ దూరంలో బహవల్‌పూర్‌ ఉంది. 

ఈ నగరంలో జామియా మస్జిద్ సుబహానల్లా ఉంది. దీన్నే స్థానికులు ఉస్మానో అలీ క్యాంపస్ అని పిలుస్తుంటారు. బహవల్‌పూర్‌‌లోని జామియా మస్జిద్ సుబహానల్లాను ప్రధాన కేంద్రంగా చేసుకొని జైషే మహమ్మద్‌ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2000 దశకం తొలినాళ్లలో జైషే మహమ్మద్‌ ఉగ్రసంస్థను మౌలానా మసూద్ అజర్ స్థాపించాడు.  పాక్ ఉగ్రవాదులను కశ్మీర్‌లో జిహాద్ కోసం ఉసిగొల్పాడు.

గత కొన్ని దశాబ్దాల్లో భారతగడ్డపై జరిగిన ఎన్నో ఉగ్రవాద దాడుల వెనుక మసూద్ అజర్ హస్తం ఉంది. అతడిని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అందుకే బాహ్య ప్రపంచానికి మొహం చూపించకుండా, పాకిస్థాన్‌లోనే రహస్యంగా మసూద్ అజర్ జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ కారణాల వల్లే ‘ఆపరేషన్ సిందూర్’ వేళ ఈ ఏడాది మే 7న బహవల్‌పూర్‌‌లోని జామియా మస్జిద్ సుబహానల్లాపై భారత ఆర్మీ భీకర దాడులు చేసింది. నిఘా వర్గాల పక్కా సమాచారంతోనే ఈ ఎటాక్ చేసింది.

భారత్ దాడి తర్వాత ఉగ్రవాది మసూద్ అజర్ వెక్కివెక్కి ఏడ్చాడని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.  భారత సైన్యం ఆపరేషన్‌లో తన కుటుంభంకు చెందిన 10 మంది చనిపోయారని అతడు స్వయంగా వెల్లడించాడంటూ ఆయా కథనాల్లో ప్రస్తావించారు. భారత్ దాడి జరిపినప్పుడు వారంతా జామియా మస్జిద్ సుబహానల్లా లోపలే ఉన్నట్లు వెల్లడైంది.

బహవల్‌పూర్‌‌పై భారత్ దాడి చేసిన నెల తర్వాత, జూన్‌లో పాకిస్థాన్ అగ్ర రాజకీయ నేత బిలావల్ భుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాది మసూద్ అజర్ ఎక్కడున్నాడో తమకు తెలియదంటూ, ఒకవేళ అజర్ ఆచూకీపై భారత్ సరైన సమాచారాన్ని అందిస్తే, పాక్ సంతోషంగా అరెస్టు చేస్తుందని ప్రకటించారు. పాక్ గడ్డపై అజర్ ఎక్కడున్నాడో చెప్పాలని భారత్‌ను ప్రశ్నించారు.