
భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) అనుసరిస్తున్న పద్ధతుల్లో ఏదైనా చట్టవిరుద్ధం అని తేలితే, బిహార్‌లో చేపట్టిన ‘ఓటర్ల జాబితా సమగ్ర సవరణ’ (ఎస్ఐఆర్)ను రద్దు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిహార్‌లో చేపట్టిన ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలపై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్జిలతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది.
ఈ సందర్భంగా ఎస్ఐఆర్ నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ చట్టాలను, తప్పనిసరి నిబంధనలను పాటించిందని తాము భావిస్తున్న సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ తాము ఇచ్చే తుది తీర్పు బిహార్‌కు మాత్రమే కాదు, దేశం మొత్తానికి వర్తిస్తుందని స్పష్టం చేసింది. బిహార్ ఎస్ఐఆర్ కసరత్తుపై తుది వాదనలు అక్టోబర్ 7న వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది.
బీహార్ ఎస్ఐఆర్ లో ఆధార్ కార్డును 12వ నిర్దేశిత పత్రంగా చేర్చాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ సెప్టెంబర్ 8న ఇచ్చిన ఉత్తర్వులను సవరించడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. “డ్రైవింగ్ లైసెన్స్‌లను నకిలీ చేయవచ్చు. రేషన్ కార్డులను నకిలీ చేయవచ్చు. అనేక పత్రాలను నకిలీ చేయవచ్చు. చట్టం అనుమతించినంత వరకు ఆధార్‌ను ఉపయోగించుకోవాలి” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
“మేము అక్టోబర్ 7న ఈ విషయాన్ని పరిశీలిస్తాము. ఈలోగా మీలో ప్రతి ఒక్కరూ వాదనల సంక్షిప్త గమనికను సిద్ధం చేసుకోండి” అని తెలిపింది. ఇంతకు ముందు, నిర్ణీత కాల వ్యవధుల్లో దేశవ్యాప్తంగా ‘ఓటర్ల జాబితా సమగ్ర సవరణ’ (ఎస్ఐఆర్) ప్రక్రియను నిర్వహించాలనే ఆదేశాలు జారీ అయితే తమ ప్రత్యేక అధికార పరిధికి విఘాతం కలుగుతుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది.
‘ఓటర్ల జాబితా సమగ్ర సవరణ’కు సంబంధించిన విధానంపై పూర్తి విచక్షణతో స్వతంత్రంగా నిర్ణయాన్ని తీసుకునే అధికారం తమకు ఉందని పేర్కొంది. ఈ విషయంలో ఇతర సంస్థలతో నిమిత్తం లేకుండా పనిచేసే స్వేచ్ఛ తమకు ఉందని ఈసీ చెప్పింది. ఈ మేరకు వాదనలతో సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ను ఎన్నికల సంఘం దాఖలు చేసింది.
More Stories
హజారీబాగ్‌లో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి
జైళ్ల కంటే దారుణంగా బెగ్గర్స్ హోమ్స్
గృహ నిర్మాణం ప్రాథమిక హక్కు