హైదరాబాద్ భారతీయ ఆత్మలో భాగమైన నిర్ణయాత్మక రోజు

హైదరాబాద్ భారతీయ ఆత్మలో భాగమైన నిర్ణయాత్మక రోజు
హైదరాబాద్ ను విముక్తి చేసి, భారత దేశంలో విలీనం కావించిన రోజు భారతీయ ఆత్మలో ఈ ప్రాంతం భాగమైన నిర్ణయాత్మకమైన రోజని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ విముక్తి ఉద్యమంలో భాగమైన చారిత్రక సంఘటనలు, వ్యక్తిత్వాలను వర్ణిస్తూ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ  కార్యాచరణలో ఐక్యత, స్వేచ్ఛలో గౌరవం దేశానికి సర్దార్ పటేల్ ఇచ్చిన బహుమతి అని తెలంగాణ కొనియాడారు. హైదరాబాద్ విముక్తి కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకోవాలని నగర ప్రజలను కోరుతూ, సెప్టెంబర్ 17, 1948 నాటి చారిత్రక ప్రాముఖ్యతను గవర్నర్ ప్రస్తావించారు. రజాకార్ల నిరంకుశత్వం ఉన్నప్పటికీ, హైదరాబాద్ ప్రజలు దృఢంగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.
 
“వారు పోరాడారు, బాధపడ్డారు, కానీ చివరికి విజయం సాధించారు. వారి జ్ఞాపకాలను గౌరవించడం, వారి కథను భవిష్యత్ తరాలకు అందించడం మన పవిత్ర కర్తవ్యం” అని ఆయన చెప్పారు. హైదరాబాద్ విముక్తి ఉద్యమంలో భాగమైన చారిత్రక సంఘటనలు, వ్యక్తిత్వాలను వర్ణిస్తూ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన రాష్ట్రంలోని ప్రజలందరికీ చేరాలని జిష్ణు దేవ్ వర్మ అభిలాష వ్యక్తం చేశారు. 
 
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన “లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్ సంస్థాన్” అనే వర్చువల్ ఎగ్జిబిషన్‌ను కూడా గవర్నర్ ప్రారంభించారు. దీనిని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ (ఎన్ సి ఎస్ ఎన్) సాలార్ జంగ్ మ్యూజియం సహకారంతో అభివృద్ధి చేసింది. నిజాం పాలన, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, జాతీయవాదం పెరుగుదల, హైదరాబాద్ సంక్షోభం, ఆపరేషన్ పోలో, చివరికి హైదరాబాద్‌ను భారత యూనియన్‌తో అనుసంధానించడం వంటి హైదరాబాద్ చరిత్ర వివరణాత్మక కథనాన్ని ఈ గ్యాలరీ అందిస్తుంది.

ఆగస్టు 15, 1947న భారతదేశం స్వాతంత్ర్యం పొందడంతో ఆనాడు దేశం మొత్తం మూడు రంగుల జెండా ఎగురవేస్తూ, ప్రజలు స్వేచ్ఛా ఉత్సవాలను జరుపుకుంటుండగా  హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాజ్యంలోని ప్రజలపై దమనకాండ కొనసాగుతూ వచ్చిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. చివరకు భారత ప్రభుత్వ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్  నేతృత్వంలో నిజాం రాజ్యంపై ఆపరేషన్ పోలో ప్రకటించి యుద్ధం ప్రారంభించవలసి వచ్చిందని తెలిపారు.

మిలటరీని, ట్యాంకర్లు, విమానాలు తోడై నిజాం ఆర్మీ రజాకర్లపై యుద్ధం ప్రారంభించడంతో, దిక్కుతోచని పరిస్థితుల్లో నిజాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు,  మూడు రంగుల జెండా ముందు తలవంచి లొంగిపోయాడని చెప్పారు. దురదృష్టకరం ఏంటంటే ఈ చరిత్రను, వాస్తవాలను ఇప్పటి తరానికి తెలియకుండా, 75 సంవత్సరాలుగా దేశాన్ని పాలించిన పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించేందుకు అంగీకరించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

1998లో విద్యాసాగర్ రావు నేతృత్వంలో బిజెపి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగాయని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా జరుపుకోవడానికి అంగీకరించలేదని, పైగా, అక్రమ నిర్బంధాలకు గురిచేశారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గత మూడేళ్ళుగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

నిజాం పాలనలో జరిగిన దమనకాండ, రాష్ట్ర విమోచన ఉద్యమానికి సంబంధించిన అన్ని అంశాలను తెలియజేసేలా  ఈ డిజిటల్ మ్యూజియం రూపొందించడం జరిగిందని చెప్పారు. ఎంపీ ఈటల రాజేందర్, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు, పిఐబి అదనపు డైరెక్టర్ శృతి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.  సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిన దాదాపు 50 ప్యానెల్‌లతో కూడిన నాలుగు రోజుల ప్రదర్శన 2025 సెప్టెంబర్ 14 నుండి 17 వరకు నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో తెరిచి ఉంటుంది.